మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటేనని తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. ఆమె శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. కొన్ని నెలల క్రితం వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఇందిరా శోభన్ ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంఎల్‌ఎ సోమనాథ్ భారతి సమక్షంలో ఆమె శనివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్ మాట్లాడారు. అవినీతికి తావులేని ఆప్ విధానాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లుగా చెప్పారు. ఆప్ సామాన్యుల పార్టీ అని.. పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తాను ఒక సామాన్య కుటుంబం నుంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్లుగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపిని ఎదుర్కొనే ఏకైక వ్యక్తి ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అని అన్నారు. భవిష్యత్తులో చాలా మంది నేతలు ఆప్‌లో చేరతారన్నారు.
వైఎస్ షర్మిల పార్టీని తెలంగాణలో ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆప్ విధానాలు నచ్చే తాను పార్టీలో చేరినట్లుగా తెలిపారు. ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. అయితే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వం తీరుతోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఆ సమయంలో వైఎస్ షర్మిలతో భేటీ అయిన ఇందిరా శోభన్ తాను తెలంగాణలో షర్మిల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. షర్మిల పార్టీ పెట్టక ముందు నుంచే ఆమె వెంట నడిచారు. అంతే, కాకుండా పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించారు. వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభోత్సవంలో కూడా ఇందిరా శోభన్ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. షర్మిలతో కలిసి ముందుకు సాగారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలు ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయారు. తాజాగా ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.
Indira Shoban joined in AAP Party