Friday, April 25, 2025

త్వరలో ఇందిరమ్మ అమృతం!

- Advertisement -
- Advertisement -

టీనేజీ యువతుల కోసం కొత్త పథకం
త్వరలోనే ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పౌష్టికాహారం అందించడమే లక్షం ఐరన్
లోపం, రక్తహీనతను నివారించడమే లక్షం
పైలెట్ ప్రాజెక్టుగా కొత్తగూడెం, ఆసిఫాబాద్,
ములుగు జిల్లాల్లో అమలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి ‘ఇందిరమ్మ అమృతం’ అనే పేరును పరి శీలిస్తున్నట్టుగా తెలిసింది. టీనేజీ యువతుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే యువతులకు సరైన పోషకాహారం లేక ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. దీనికితోడు చిన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటే వ్యాధులు రావని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి తోడు మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారం అలవాట్లు ఇవన్నీ టీనేజీ యువతులపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని యువతల కోసం ఈ కొత్త పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారి ఆరోగ్యంపై దృష్టి సారించిందని సమాచారం.

చాలామంది యువతులు రక్తహీనత, ఐరన్ లోపంతో ఇబ్బంది

మారుతున్న జీవనశైలి, ఆపై ఆహారపు అలవాట్లతో చాలామంది యువతులు రక్తహీనత, ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. టీనేజీలో ఉన్న యువతుల శరీరంలో వచ్చే మార్పుల వల్ల రక్తం, ఐరన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జంక్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కు వగా తీసుకోవడంతో వారికి రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. పండ్లు, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా తీసుకోవడం వల్ల పలు సమస్యలు టీనేజీ యువతులను వెంటాడుతున్నాయి.

ఒక్కో యువతీకి 15 ప్యాకెట్ల చొప్పున…

తెలంగాణలో నివసించే టీనేజీ యువతుల్లో చాలామంది ఐరన్ లోపం, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. వాటిని నివారించేందుకు ఈ కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 14 నుంచి 18 ఏళ్ల్ల మధ్య యువతులు ఐరన్, రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు 15 ప్యాకెట్ల చొప్పున రెండు రకాలను ప్రతి టీనేజ్ యువతికి ఇచ్చేలా ఈ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. వీటిని అంగన్‌వాడీల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి ‘ఇందిరమ్మ అమృతం’ అనే పేరును ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఈ పథకానికి రెండు, మూడు రోజుల్లో పేరును ఖరారు చేయనున్నారు.

ఈ పథకాన్ని తొలి దశలో ఫైలట్ ప్రాజెక్టు కింద కొత్తగూడెం, అసిఫాబాద్, ములుగు జిల్లాలను అధికారులు ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ జిల్లాల్లో ఉన్న టీనేజ్ యువతులకు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలను, అంగన్‌వాడీ టీచర్, ఆయాలు పంపిణీ చేయనున్నారు. వాటిని పంపిణీ చేసే సమయంలో టీనేజ్ యువతులకు సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల గురించి వారు వివరించనున్నారు. అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు ఏ విధంగా ఎదుర్కొవాలన్న దానిపై వారు అవగాహన కల్పించనున్నారు.

జూన్ నుంచి ప్రారంభం

ఇప్పటికే దీనికి సంబంధించి టెండర్లు సైతం ప్రభుత్వం పిలిచింది. జూన్ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడంతో పాటు మిల్లెట్ పట్టీలు, పల్లి పట్టీలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశ కింద ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసే ఈ మూడు జిల్లాల్లో (కొత్తగూడెం, అసిఫాబాద్, ములుగు జిల్లాలను) ఈ పథకం విజయవంతం అయితే అన్ని జిల్లాల్లో వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే గర్భిణులు, బాలింతలకు ‘ఆరోగ్య లక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దాని కింద బియ్యం, పప్పు, 200 మిల్లీ లీటర్ల పాలు, నెలకు 30 గుడ్లు అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News