Tuesday, November 5, 2024

నవంబర్ 7 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపికలో ఈ ప్రత్యేక యాప్‌దే కీలకపాత్ర అని అందుకే ఇంత సమయం పట్టిందన్నారు. ఆధార్‌తో సహా అన్నివివరాలు ఈ యాప్‌లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. నవంబర్ 6 లేదా 7వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి తెలిపారు. నవంబర్ 20వ తేదీ లోపే అర్హులైన లబ్ధిదారుల ఫైనల్ జాబితా తయారు అవుతుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీ నుంచి గ్రౌండ్ లోకి వెళ్లి పనులు ప్రారంభమయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే వారి జాబితాను ఖరారు చేస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన చెప్పారు. లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలే ఫైనల్ చేస్తాయని, స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన తెలిపారు. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, పేదరికమే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభానికి కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందన్న సంకేతాలు తమకు ఉన్నాయన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదు
రాష్ట్రంలో ప్రముఖ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అవుతారని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మరోసారి స్పందించారు. తాను అన్న బాంబు ఒకటి, రెండు రోజులు ఆటో, ఇటో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది కొరత ఉందన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా నిజమైన పేదలకు న్యాయం చేస్తామని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రీన్ చానెల్‌లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుందని, లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదని ఆయన పేర్కొన్నారు.

2004-2014 వరకు 19.36 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో నీళ్లు, కరెంట్, డ్రైనేజ్ లాంటి వసతుల్లేవని ఆయన ఆరోపించారు. తాము అన్నీ వసతులు కల్పించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి 19.36 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News