Sunday, April 13, 2025

సుప్రీం తీర్పు ‘గవర్నర్’కు కనువిప్పు

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ పరమైన ప్రక్రియకు విరుద్ధంగా గవర్నర్లు తమ బిల్లులను ఆమోదించకుండా విపరీతంగా కాలయాపన చేస్తున్నారని తమిళనాడు కేరళ, పంజాబ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు గతంలో సుప్రీం కోర్టు ముందు మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు శాసనసభ గవర్నర్ ఆమోదం కోసం పంపిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఎలాంటి పరిశీలన చేయకుండా మూడేళ్లుగా తన వద్దే అట్టే పెట్టుకోవడంపై గతంలో సుప్రీం కోర్టు ఆక్షేపించడం కూడా జరిగింది.అయినా గవర్నర్ వైఖరిలో మార్పురావడం లేదు. ఈసారి 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న సాకుతో తమిళనాడు గవర్నర్ తన వద్దే పెండింగ్‌లో పెట్టుకోవడం సుప్రీం కోర్టు ముందుకు విచారణ వచ్చింది.

ఈసారి సుప్రీం కోర్టు ధర్మాసనం మళ్లీ గవర్నర్‌కు తన రాజ్యాంగ పరిధి, బాధ్యతలు ఎంతవరకో గుర్తు చేసింది. అంతేకాదు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని పరోక్షంగా హెచ్చరించింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ మంగళవారం ( ఏప్రిల్ 8) తీర్పు ఇచ్చింది. ఏకంగా 10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలన్న గవర్నర్ చర్య ఏక పక్షమేకాక, చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు కొన్ని అధికారాలు, అవకాశాలు ఉంటాయి. శాసనసభ పంపిన బిల్లుకు ఆమోదం తెల్పడం, అభ్యంతరాలుంటే పెండింగ్‌లో పెట్టడం, ఆ అభ్యంతరాలను శాసనసభకు తెలియజేస్తూ తిరిగి వెనక్కు పంపడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం వంటివి గవర్నర్ ప్రధాన బాధ్యతలు.

ఇవేవీ సక్రమంగా నిర్వర్తించకుండా తన వద్దనే అట్టేపెట్టుకోవడం రాజ్యాంగ రాద్ధాంతానికి దారి తీస్తుంది. అది ఎవరికీ మంచిదికాదు. ఇదే అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు విడమరిచి చెప్పింది. గవర్నర్ బిల్లును పునః పరిశీలనకు వెనక్కి పంపాక, తిరిగి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత, రెండోసారి ఆ బిల్లులను రాష్ట్రపతి సిఫార్సు కోసం గవర్నర్ పంపకూడదని, అలా చేస్తే చట్టవిరుద్ధమవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలని గుర్తుచేసింది. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించాలనుకుంటే నెలరోజుల్లోపే గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. రాష్ట్రపతికి సిఫార్సు అవసరం లేదనుకుంటే మూడు నెలల్లోపే బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని, అంతేకానీ శాశ్వతంగా వాటిని తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది.

రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తే ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వు చేయవచ్చు. ఇంత స్పష్టంగా గవర్నర్ బాధ్యతల గురించి సుప్రీం కోర్టు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. ఇది ఒక్క తమిళనాడు గవర్నర్‌కే అని అనుకోరాదు. రాజ్యాంగ విధులను విస్మరించిన గవర్నర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది కనువిప్పు అవుతుంది. దీన్ని బట్టి శాసనసభ తీర్మానమే పైచేయి అవుతుంది తప్ప గవర్నర్ నిర్ణయం కాదు. గవర్నర్ పాత్ర మొక్కుబడే తప్ప శాసనసభను శాసించే పరిస్థితి ఉండదు. ఇక్కడ తమిళనాడు గవర్నర్ తన వద్దకు వచ్చిన 10 బిల్లుల గురించి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నారని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించడంతోనే గవర్నర్ వైఖరి బయటపడింది. ఇప్పుడే గత కొంతకాలంగా తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్న సంగతి సుప్రీం కోర్టు ఇది వరకే గ్రహించింది.

తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తి ప్రతిష్టంభన ఏర్పడగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని గట్టిగా మందలించింది.అంతేకాదు తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కూడా వివాదాలకు దారి తీసింది. ప్రభుత్వం అందజేసిన ప్రసంగం చదవకుండా గవర్నర్ స్వంతంగా ప్రసంగించారని ముఖ్యమంత్రి స్టాలిన్, మంత్రిమండలి ధ్వజమెత్తిన సంఘటన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అలాగే జాతీయ గీతం ఆలపించకుండా ద్రవిడ సంప్రదాయ గీతాన్ని ఆలపించారని గవర్నర్ కోపంతో సభనుంచి అర్ధంతరంగా నిష్క్రమించడం గవర్నర్ దుందుడుకు చర్యగా విమర్శలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్నా, సుప్రీం కోర్టు ధర్మాసనం గట్టిగా మందలించినా గవర్నర్ వైఖరిలో మార్పు రాకపోవడం చర్చకు దారి తీస్తుంది. గవర్నర్ అంటే ఒక రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి. కేంద్ర స్థాయిలో భారత రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌కు ఉంటాయి.

రాజ్యాంగ అధిపతిగా గవర్నర్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా ఆధారంగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విధి. అయితే కేంద్రంలోను, రాష్ట్రాల్లోనూ వివిధ రాజకీయ వ్యవస్థలు పాలించడం ప్రారంభం కావడంతో రాజ్యాంగ పరంగా అనుసరించాల్సిన విధానాలు గాడి తప్పుతున్నాయి. అయితే కొందరు తాము 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం నియామకమైన ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరిస్తుంటారు. ఆ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు గవర్నర్లకు విపరీతమైన అధికారాలను కట్టబెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వ ఏజెంట్లుగా అప్పటి గవర్నర్లు వ్యవహరించేవారు. 2014లో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే గవర్నర్లు కేంద్రానికి ఏజెంట్లా? కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన గవర్నర్లు ప్రజలకు జవాబుదారీ అవుతారా? అలాగే వారికి శాసనాధికారాలు ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News