దట్టమైన అడవులతో నిండిన ఈశాన్య రాష్ట్రాలు ప్రభుత్వం క్రియాశూన్యత, అడవుల మాఫియా, రాజకీయ నాయకుల కుమ్మక్కు, మానవుల దురాశ కారణంగా హరిత ప్రాంతాన్ని వేగంగా కోల్పోతోంది. గడచిన రెండు దశాబ్దాల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరమ్, నాగాలాండ్, త్రిపురలలో అటవీ ప్రాంతంలో మార్పులపై జరిపిన విశ్లేషణ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని సూచిస్తోంది. భారత అడవుల పరిస్థితి (ఐఎస్‌ఎఫ్‌ఆర్) నివేదికలు (2003, 2013, 2023) ప్రకారం, ఐఎస్‌ఎఫ్‌ఆర్‌లో మొక్కల పెంపకం కింద విస్తీర్ణాన్ని పెంచినప్పటికీ సాలుకు సగటున 224 చదరపు కిమీ వంతున 4490 చదరపు కిమీ అడవులను ఆ ప్రాంతం కోల్పోయింది.
గడచిన రెండు దశాబ్దాల్లో మొత్తం నష్టం ఢిల్లీ విస్తీర్ణానికి మూడు రెట్లుతో సమానం. అరుణాచల్ ప్రదేశ్‌లో గరిష్ఠంగా 2137.43 చదరపు కిమీ ప్రాంతం నష్టం నమోదైంది. ఇది 2003లో నమోదైన అటవీ ప్రాంతంలో 3.24 శాతం మేర ఉంది. రెండవ స్థానంలో ఉన్న నాగాలాండ్ సుమారు 1386.53 చదరపు కిమీ అటవీ ప్రాంతం నష్టపోయింది. అది 2003లో నమోదైన అటవీ విస్తీర్ణంలో 11.34 శాతంగా ఉంది. అస్సాం, మేఘాలయ గడచిన రెండు దశాబ్దాల్లో అటవీ విస్తీర్ణంలో పెరుగుదలను (487.55, 127.84 చదరపు కిమీ) నమోదు చేశాయి. అయితే, అస్సాంలోని స్వతంత్ర ప్రతిపత్తి మండలుల పరిధిలోని రెండు ప్రాంతాలు కార్బి అంగ్‌లాంగ్, ఉత్తర కచార్ హిల్ అదే కాలంలో సుమారు 529 చదరపు కిమీ మేర అటవీ విస్తీర్ణం నష్టాన్ని నమోదు చేశాయి.
దశాబ్దపు సరళిపై విశ్లేషణ 2003, 2023 మధ్య అటవీ విస్తీర్ణంలో మొత్తం నష్టాన్ని సూచించింది. 2003, 2023 మధ్య దశాబ్దంలో సుమారు 83 శాతం నష్టం సంభవించింది. అదే కాలంలో అస్సాం మినహా తక్కిన రాష్ట్రాలు అన్నీ అటవీ విస్తీర్ణం నష్టాన్ని నమోదు చేశాయి. గరిష్ఠంగా సుమారు 1439.43 చదరపు కిమీ మేర అరుణాచల్ ప్రదేశ్‌లో నమోదైంది. 1063.54 చదరపు కిమీతో మిజోరమ్, 821.53 చదరపు కిమీతో నాగాలాండ్ అటవీ ప్రాంత నష్టాన్ని నమోదు చేశాయి. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ (జిఎఫ్‌డబ్ల్యు) డేటా ప్రకారం, 200123 కాలంలో ఈశాన్య ప్రాంతంలో అటవీ ప్రాంత నష్టం అదే కాలంలో దేశంలోని మొత్తం అటవీ ప్రాంత నష్టంలో 75 శాతంపైగా ఉంది. దీనితో పర్యావరణ కార్యకర్తలు, అడవుల పరిరక్షణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టిఎన్ గోదావర్‌మాన్ తిరుముల్‌పాద్ 1995లో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఏ రాష్ట్రంలోను అన్ని రకాల అడవుల నరికివేతను సుప్రీంకోర్టు నిషేధించడానికి అది దారి తీసింది. ఈ సందర్భంగా ఆసక్తికరం ఏమిటంటే, తిరుముల్‌పాద్ కేసు చరిత్ర సృష్టించడం. అసలు అదే అనూహ్యంగా చరిత్ర అయింది. 1996లో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కొందరు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు వారు విచక్షణారహితంగా అడవుల నరికివేతను గమనించారు. ఢిల్లీకి తిరిగి వచ్చిన తరువాత వారు మొక్కల నరికివేత నిషేధానికి ఉత్తర్వు జారీ చేసేందుకు వీలుగా అడవులకు సంబంధించిన జాబితా కోసం ఎస్‌సి రిజిస్ట్రీని అడిగారు.
రెండు కేసులు ఒకటి గోదావర్‌మాన్ కేసు, రెండవది పర్యావరణ చైతన్య వేదిక కేసుగా పేర్కొంటున్న కేసు ఉన్నాయని రిజస్ట్రార్ తెలిపారు. అనుకోకుండా న్యాయమూర్తులు మొదటి కేసులో ఉత్తర్వులు జారీ చేశారు. దానితో తిరుముల్‌పాద్ పేరు భారత పర్యావరణ చరిత్రలో శాశ్వతంగా లిఖితమైంది. అందువల్ల, ఈశాన్య ప్రాంతంలో భారీ ఎత్తున అడవుల నరికివేత భారత్‌లో పర్యావరణ, అడవుల సంరక్షణపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పునకు మూల కారణమైంది. అయినప్పటికీ, కోర్టు ఆ తీర్పు పూర్తిగా అమలయ్యేలా ఎన్నడూ చూడలేదు. ఈశాన్య ప్రాంతంలోని అన్ని అడవుల్లో పది శాతాన్ని జీవవైవిధ్య అభయారణ్యాలుగా ప్రకటించాలన్న 1998 నాటి ఉత్తర్వు ఇప్పటికీ అమలు కాలేదు.
పర్యావరణంపై అటువంటి నిరుత్సాహకర పరిస్థితులు, నానాటికీ క్షీణిస్తున్న అటవీ ప్రాంతం దృష్టా ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు అడవుల నరికివేత నిలుపుదలకు వెంటనే పరిహార చర్యలు తీసుకుని ఉండవలసింది. అయితే, ఇటీవలి కాలంలో మనం చూసినట్లుగా వారు ఈశాన్య ప్రాంతంలో పర్యావరణం నాశనానికి మరింతగా పాల్పడుతున్నారు. అటవీ (సంరక్షణ) చట్టం కింద కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ముందస్తు అనుమతి పొందకుండా మూడు ప్రతిపాదిత రిజర్వ్ ఫారెస్ట్ (పిఆర్‌ఎఫ్)లను డినోటిఫై చేయాలన్న అస్సాం ప్రభుత్వ తాజా నిర్ణయం ఆ చర్య చట్టబద్ధతపైన, పర్యావరణంపై దాని ప్రభావంపైన చర్చను లేవదీసింది.
ఆ మూడు పిఆర్‌ఎఫ్‌లు తల్పథర్ (170 హెక్టార్లు), మొహోంగ్‌పథర్ (466 హెక్టార్లు), దువార్‌మరాహ్‌కు మొదటి చేర్పు(113 హెక్టార్లు) ను రెవెన్యూ గ్రామాలుగా మార్చేందుకు డినోటిఫై చేయనున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జనవరి 31న ప్రకటించిన ఆ నిర్ణయం లక్షం పైన పేర్కొన్న మూడు పిఆర్‌ఎఫ్‌లను రెవెన్యూ గ్రామాలుగా మార్చడం ద్వారా వాటిలో నివసిస్తున్న 20 వేల మందికి పైగా ప్రజలకు భూమి హక్కులు మంజూరు చేయడం. అయితే, అది అటవీ భూమిలో ఆక్రమణలకు ప్రమాదకర ఆనవాయితీ సృష్టిస్తుందని, ‘ఒకసారి అడవి అయితే, ఎల్లకాలం అడవే’ అనే దీర్ఘకాలిక న్యాయ సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
ముందస్తు అనుమతులు లేకుండా అడవులు, అభయారణ్యాలు, జాతీయ ఉద్యానాల రిజర్వేషన్ రద్దును నిషేధిస్తున్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను పిఆర్‌ఎఫ్ డినోటిఫికేషన్ నేరుగా ఉల్లంఘిస్తుందని పర్యావరణ కార్యకర్తలు, న్యాయ కోవిదులు వాదిస్తున్నారు. 2025 జనవరి 31న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించిన ఆ నిర్ణయం లక్షం తూర్పు అస్సాం తీన్‌సుకియా జిల్లాలో 20 వేల మందికి పైగా ప్రజలకు భూమి హక్కులు మంజూరు చేయడం.
సరైన సరిహద్దు గుర్తింపు లేకపోవడం, అటవీ శాఖకు ప్రభుత్వ యాజమాన్యంలోని ఖాస్ భూమి బదలీ పెండింగ్‌లో ఉండడం కారణంగా పొబితోర వన్యమృగ అభయారణ్యం (పిడబ్లుఎస్)ను డినోటిఫై చేయాలని అస్సాం ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
అస్సాం మోరిగాఁవ్ జిల్లాలో వన్యమృగ అభయారణ్యంగా పొబితోర నోటిఫికేషన్‌ను ‘ఉపసంహరించాలన్న’ అస్సాం మంత్రివర్గ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు నిరుడు మార్చి 13న నిలుపుదల చేసింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం అభయారణ్యం భూప్రాంత గుర్తింపును వివరిస్తూ, పర్యావరణ సున్నిత మండలంగా దానిని ప్రకటిస్తూ ఒక అఫిడవిట్‌ను వెంటనే దాఖలు చేయవలసిందిగా అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఉపసంహరణ’ సాకుతో డినోటిఫికేషన్‌కు పూనుకొనడానికి బదులు వన్యమృగ (సంరక్షణ) చట్టం సెక్షన్ 26 కింద ప్రజల వాదనలు, హక్కులను పరిష్కరించవలసిందిగా కూడా అస్సాం ప్రభుత్వానికి సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది.
1998 నోటిఫికేషన్ ఆధారంగా పొబితోర వన్యమృగ అభయారణ్యం సరిహద్దు గుర్తింపును వివరిస్తూ ఒక అఫిడవిట్ సమర్పించవలసిందిగా అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.అన్ని రకాలుగా అటవీ భూమి డినోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసినందున, కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే అటవీ భూమి మార్పును అటవీ (సంరక్షణ)చట్టం కింద అనుమతిస్తున్నందున, దాని ప్రకారం మార్పు తరువాత అటవీ భూమి చట్ట ప్రతిపత్తి మారదు కనుక ‘ఒకసారి అడవి అయితే ఎల్లకాలం అడవే’ అనే న్యాయ సూత్రం అమలులోకి వచ్చింది.
ఈ సూత్రాన్ని సుప్రీం కోర్టు (ప్రేమ్ మోహన్ గౌర్ వెర్సస్ ఎన్‌హెచ్‌ఎఐ, నరీందర్ సింగ్ వెర్సస్ దేవేష్ భూటాని), సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిప కేంద్ర సాధికార కమిటీ (సిఇసి నివేదిక 2010), అటవీ భూమికి సంబంధించిన కేసులను నిర్ణయిస్తూ హైకోర్టులు పలు మార్లు విస్పష్టంగా ప్రకటించాయి. ఇది ఇలా ఉండగా, 1995 నాటి రిట్ పిటిషన్ (సివిల్) నం. 202లో ఐఎ నం.703లో 2001 నవంబర్ 23న జారీ చేసిన తమ ఉత్తర్వు ప్రకారం అటవీ భూమిలో ఆక్రమణలను మరింతగా క్రమబద్ధం చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలువరించింది. ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ముందు అటవీ భూమిలో ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందనున్న ప్రతిపాదనల పరంపర నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ చర్య తీసుకున్నది. భవిష్యత్తులో క్రమబద్ధం చేస్తారనే ఆశతో మరింతగా ఆక్రమణలు చోటు చేసుకోవచ్చు.
చివరకు, సుప్రీం కోర్టు రిట్ పిటిషన్ 1164/2023లో 2025 ఫిబ్రవరి 3 నాటి తన తాజా తీర్పులో ఇలా ఆదేశించింది: ‘తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు, అడవుల పెంపకం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం పరిహార భూమిని సమకూర్చనిదే అటవీ భూమి కుదింపునకు దారి తీసే ఏ చర్యలనూ కేంద్రం గాని, ఏ రాష్ట్రమైనా గాని తీసుకోరాదని మేము స్పష్టం చేస్తున్నాం’. ఏ అటవీ భూమినీ డినోటిఫై చేసే ఏకైక అధికారం రాష్ట్ర మంత్రివర్గానికి లేదని పర్యావరణ కార్యకర్తలు సూచించారు. ఆ విధంగా డినోటిఫై చేయడం ఆక్రమణలను క్రమబద్ధం చేసే యత్నమేనని కూడా వారు విమర్శించారు. అలా చేయడం అటవీ భూమిలో మరిన్ని ఆక్రమణలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2001లో (రిట్ పిటిషన్ 202/1995లో ఐఎనం.703)లో జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధం అని వారు స్పష్టం చేశారు.
– గీతార్థ పాఠక్