వాషింగ్టన్: భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి రేసులో పోటీపడనున్నారు. ఈక్రమంలో ప్రముఖ ఇండో అమెరికన్ రాజకీయవేత్త నిక్కీ హేలీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2024లో అధ్యక్ష హోదాలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టేందుకు మాజీ అమెరికా అధ్యక్షుడుట్రంప్‌ను సవాల్ చేసిన మొదటి రిపబ్లికన్‌గా నిలిచారు. 51సంవత్సరాల హేలీ కరోలినాకు రెండుసార్లు గవర్నర్‌గా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారిగా ఉన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నట్లు నిక్కీ హేలీ స్వయంగా వీడియో సందేశంలో ప్రకటించారు. కొత్త తరం నాయకత్వాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని హేలీ తెలిపారు. గతేడాది చివర్లో అధ్యక్ష పదవికి పోటీచేయనున్నట్లు ప్రకటించిన 76ఏళ్ల మాజీ బాస్ డోనాల్డ్ ట్రంప్‌కు నిక్కీహేలీ మొదటి పోటీదారుగా నిలిచారు.
మరోవైపు ఇండో అమెరికన్ రిపబ్లికన్, వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కూడా జరిగే అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నిక్కీ హేలీ తన ప్రచార కార్యక్రమాన్ని మంగళవారమే ప్రారంభించగా రామస్వామి బుధవారం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మిలియనీరైన 37ఏళ్ల రామస్వామి మ్యాగజైన్ యాంటీ వోక్ ఇంక్ సిఇఒగా ఉన్నారు. యూఎస్‌లో నిజ నిర్ధారణ మిషన్‌లు ప్రారంభించారు. యూఎస్ మీడియా నివేదిక ప్రకారం రామస్వామి అధ్యక్ష పదవి రేసులో పాల్గొనేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
రామస్వామి తన వ్యాపార ట్రాక్ రికార్డును ప్రస్తావించాలని కోరుకోవడంలేదని బదులుగా స్ఫూర్తిని పునర్ వ్యవస్థీకరించడం, సమాజంలో ప్రతిభకు పట్టం కట్టే సంస్కృతిని తీసుకురావడంపై దృష్టి సారించారని ఆ దిశగా తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారని స్థానిక మీడియా సోమవారం నివేదించింది. భారత సంతతికి చెందిన రామస్వామి తండ్రి ఇంజినీర్‌కాగా, తల్లి వైద్యురాలు. రామస్వామి సిస్సినాటిలో జన్మించారు. హార్వార్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు. రామస్వామి సంపద 500మిలియన్లు డాలర్లుకుపైగా ఉంటుందని మీడియా నివేదించింది. కాగా ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేయడం ద్వారా విజయవంతమైన బయోటెక్ వ్యాపారవేత్తగా రామస్వామి గుర్తింపు పొందారు.