ఇండోనేషియాలో దుర్ఘటన
మెడాన్(ఇండోనేషియా): సుమత్రా దీవిలోని ఒక అక్రమ బంగారు గనిలో మట్టి చరియలు విరిగిపడడంతో వాటి కింద చిక్కుకున్న కనీసం 12 మంది మహిళల మృతదేహాలను సహాయకులు వెలికితీశారు. సుమత్రా దీవిలోని మండైలింగ్ నాటాల్ జిల్లాలో గల ఒక మారుమూల గ్రామంలో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్న ఒక బంగారు గనిలో గురువారం బంగారు రేణువుల కోసం గాలిస్తున్న 14 మంది మహిళలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద చిక్కుకుని 12 మంది మరణించగా ఇద్దరు మహిళలను సహాయకులు ప్రాణాలతో బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక గ్రామస్తులు బంగారం కోసం లోతైన గుంతలు తవ్వడం ఈ ప్రాంతంలో సాంప్రదాయంగా వస్తోంది. అయితే..బంగారం కోసం తవ్వే సొరంగాలపై మట్టిపెళ్లలు విరిగిపడడం, నీళ్లు ప్రవాహంలా ముంచెత్తడం, సొరంగాలు కూలిపోవడం ఇక్కడ సర్వసాధారణం. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు అక్రమ బంగారు గని తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.