Monday, December 23, 2024

ఇండోనేసియా ఓపెన్ 2023: సెమీ ఫైనల్లో ప్రణయ్..

- Advertisement -
- Advertisement -

ఇండోనేసియా ఓపెన్.. సెమీ ఫైనల్లో ప్రణయ్
సాత్విక్ జోడీ ముందుకు, శ్రీకాంత్ ఇంటికి 
జకర్తా: ప్రతిష్టాత్మకమైన ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్. ప్రణయ్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్‌చిరాగ్ షెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. శుక్రవారం చైనా షెట్లర్ లి షి ఫెంగ్‌తో జరిగిన క్వార్టర్స్ పోరులో శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. మూడు సెట్ల సమరంలో శ్రీకాంత్ 14-21, 21-14, 12-21 తేడాతో ఫెంగ్ చేతిలో కంగుతిన్నాడు.

తొలి సెట్‌లో ఫెంగ్ విజయం సాధించాడు. అయితే రెండో సెట్‌లో శ్రీకాంత్ ఆధిపత్యం చెలాయించాడు. అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మళ్లీ శ్రీకాంత్ తేలిపోయాడు. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన ఫెంగ్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ విజయం సాధించాడు. జపాన్ షట్లర్ కొడయ్ నరకొరాతో జరిగిన పోరులో ప్రణయ్ 21-18, 21-16తో జయకేతనం ఎగుర వేశాడు. తొలి గేమ్‌లో ప్రణయ్‌కు ప్రత్యర్థి నుంచి కాస్త గట్టి పోటీ ఎదురైంది.

అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన ప్రణయ్ సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో ప్రణయ్ మరింత దూకుడును ప్రదర్శించాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించాడు. ఇదే క్రమంలో అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదిలావుంటే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌చిరాగ్ జోడీ ముందంజ వేసింది. క్వార్టర్ ఫైనల్లో భారత జంట 21-13, 21-13 తేడాతో ఇండోనేసియాకు చెందిన ఫజర్ అల్ఫియాన్‌మహ్మద్ జోడీని ఓడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News