అతిపెద్ద వేడుకలకు వచ్చిన ప్రపంచ నేతలు
పరేడ్‌లో 352 మంది సభ్యుల ఇండోనేషియా బృందం కూడా కవాతు
75 ఏళ్ల తరువాత మహా పరేడ్‌కు హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు
1950లో తొలి వేడుకలు సుకర్ణో హాజరు
న్యూఢిల్లీ : ఇండోనేషియన్ అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో ఆదివారం ఢిల్లీలోని ఘనమైన కర్తవ్య పథ్‌లో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిలకించారు. గడచిన ఏడు దశాబ్దాల్లో దేశంలో భారీ ఉత్సవానికి ఆయనతో పాటు కొంత మంది ప్రపంచ నేతలు హాజరయ్యారు. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో తరువాత 75 ఏళ్లకు ఈ భారీ పరేడ్‌కు సుబియాంతో హాజరయ్యారు. సుకర్ఱో 1950లో భారత తొలి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సుబియాంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, కొంత మంది ఇతర ప్రముఖులతో పాటు దేశ రాజధానిలో కీలకమైన కర్తవ్య పథ్‌లో మహోన్నత మిలిటరీ పరేడ్‌ను, సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు.
ఇండోనేషియా విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుబియాంతో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన నాలుగవ ఇండోనేషియా అధ్యక్షుడు. ఆరుగురు క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, అతిపెద్ద వాణిజ్య బృందంతో కలసి ఇండోనేషియా అధ్యక్షుడు నాలుగు రోజుల అధికార పర్యటనపై గురువారం రాత్రి భారత్‌కు చేరుకున్నారు. ఇండోనేషియా నుంచి 352 మంది సభ్యుల కవాతు, బ్యాండ్ బృందం కూడా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నది. విదేశాల్లో ఒక జాతీయ దినోత్సవ పరేడ్‌లో ఒక ఇండోనేషియా బృందం పాల్గొనడం ఇదే ప్రథమం. భారత్‌కు బయలుదేరే ముందు జకార్తాలో ఇండోనేషియన్ మిలిటరీ బృందం రిహార్సల్స్‌లో సుబియాంతో ప్రత్యేక ఆసక్తి కనబరచినట్లు తెలుస్తోంది. సుబియాంతో శనివారం ప్రధాని మోడీతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారం విస్తరణపై దృష్టితో ఆ చర్చలు సాగాయి. కాగా, పరేడ్‌లో భారత్ తన సైనిక పటిమను ప్రదర్శించింది. దిగ్గజ కవాతు బృందాలు, క్షిపణులు, దేశీయ ఆయుధ వ్యవస్థలను పరేడ్‌లో ప్రదర్శించడమైంది. ప్రతి సంవత్సరం భారత్ తన గణతంత్ర దినోత్పవ వేడుకులు ప్రపంచ నేతలను ఆహ్వానిస్తుంటుంది. నిరుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి కాగా, 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి ఆ పరేడ్‌కు హాజరయ్యారు. కొవిడ్ 19 మహమ్మారి దృష్టా 2021, 2022 సంవత్సరాల్లో గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథి ఎవరూ లేరు.