Sunday, December 22, 2024

ఇందూరు బిజెపిలో భగ్గుమన్న విభేదాలు

- Advertisement -
- Advertisement -

Indore BJP clashes erupt

హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా మాజీ
ఎంఎల్‌ఎ యెండల, బిజెపి రాష్ట్ర నేత ధన్‌పాల్
మధ్య వాగ్వాదం ఎంపి అర్వింద్ ప్రస్తావనతో
ముదిరిన వివాదం పోలీసుల జోక్యంతో
సద్దుమణిగిన గొడవ

మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ బిజెపిలో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. ఎంపి అర్వింద్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గీయుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు శనివారంనాటి హనుమాన్ శోభాయాత్ర వేదికగా బయటపడ్డాయి. ఎంపి అర్వింద్ వర్గీయులుగా ముద్రపడ్డ బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తపై మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో జరిగే హనుమాన్ శోభాయాత్రకు అప్పటికే వేలసంఖ్యలో భక్తులు చేరుకోగా బిజెపికి చెందిన రెండువర్గాల వారు సైతం పెద్దఎత్తున మోహరించారు. శోభాయాత్ర ప్రారంభానికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ సంసిద్ధం కావడం ఎంపి అర్వింద్ వర్గీయులుగా ఉన్న ధన్‌పాల్ అర్వింద్ వచ్చే వరకు ఆపాలంటూ అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైంది. హనుమాన్ శోభాయాత్రకు సరైన సమయంలో రావాలని ఎవరికోసం శోభాయాత్ర ఆపేదిలేదంటూ లక్ష్మీనారాయణ ఆగ్రహించడంతో వివాదం రాజుకుంది.

ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి సొంత పార్టీ నేతలే ప్రాధాన్యత ఇవ్వరా అంటూ ధన్‌పాల్ ఎదురుదాడికి దిగారు. దీంతో ఎండల ఆగ్రహం కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా ధన్‌పాల్‌పైకి దూసుకెళ్లడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా బిజెపికి చెందిన రెండువర్గాలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో అరుపులు కేకలు తారాస్థాయికి చేరాయి. హనుమాన్ శోభాయాత్ర పట్ల అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు పరిస్థితిని గమనించి అక్కడికి చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయ్యింది. ఒకదశలో తోపులాట జరగ్గా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఓవైపు హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్ర నేతల మధ్య కలహాలు బయటపడ్డ పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలోనూ వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. నిజామాబాద్ బిజెపిలో ఈ వివాదం గత ఎన్నికల నుండే కొనసాగుతుండగా.. రాష్ట్ర పార్టీ నేతలు తరుచూ జిల్లా నేతలను సముదాయిస్తూ వస్తున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే టికెట్‌ను ఎండలతో పాటు ధన్‌పాల్ ఆశించగా ధన్‌పాల్‌కు నిరాశే ఎదురైంది. ఆగ్రహించిన ధన్‌పాల్ వర్గీయులు బిజెపి జిల్లా కార్యాలయంపైనే దాడి చేశారు. ఈ పరిణామంతో రాష్ట్ర బిజెపి నేతలు సైతం అవాక్కయ్యారు. అప్పట్లో జిల్లా నేతలను హైదరాబాద్ పిలిపించి తాత్కాలికంగా వివాదానికి తెరదించారు. అయినా ఇరువర్గాలు పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగానే నిర్వహిస్తూ వస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో ఎంపి అర్వింద్‌కు పట్టుపెరగగా లక్ష్మీనారాయణ వర్గీయులు నిరాశలో ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో రెండువర్గాల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. శనివారంనాటి ఘటనతో నిజామాబాద్ అర్బన్ బిజెపిలో పరిస్థితులు మరింత వేడెక్కినట్లు స్పష్టం అవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News