Saturday, July 6, 2024

ఇండోర్‌లో నోటా రికార్డు

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానంలో నోటా(నన్ ఆఫ్ ది అబవ్)కు పడిన ఓట్లు రికార్డు సృష్టించాయి. నోటా మీగను ఎంచుకోండి అంటూ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఇచ్చిన పిలుపు తీవ్ర ప్రభావం చూపించింది. బీహార్‌లోని గోపాల్ గంజ్‌లో గతంలో నోటా సాధించిన రికార్డును ఈ ఎన్నికల్లో ఇండోర్ అధిగమించింది. ఒక నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశాన్ని ఓటర్లకు నోటా కల్పిస్తుంది. 2019 ఎన్నికల్లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ లోక్‌సభ నియోజవకర్గంలో నోటా ఓట్లు రికార్డు స్థాయిలో 51,660 పడ్డాయి. ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో దాదాపు 5 శాతం ఓట్లు నోటాకు లభించాయి. మంగళవారం ఇండోర్ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరగగా 1.70 లక్షలకు పైగా ఓట్లు నోటాకు లభించినట్లు ఇసి వెబ్‌సైట్ చూపింది. బిజెపి అభ్యర్థి శంకర్ లాల్వానీకి మొత్తం 9.9 లక్షల ఓఒట్లు లభించగా తర్వాతి స్థానంలో నోటా ఉండడం విశేషం.

ఈ స్థానంలో బరిలో ఉన్న మిగిలిన 13 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు లభించాయి. తన బిఎస్‌పి ప్రత్యర్థి విజయ్ సోలంకి కన్నా లాల్వాని 9.48 లక్షల ఓట్ల ఆధిక్యతను సాధించారు. కాగా..లోక్‌సభ ఎన్నికలకు ముందు అక్షయ్ కాంతి రామ్‌ను ఇండోర్ స్థానానికి తన అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఏప్రిల్ 29న తన నామినేషన్‌ను ఆయన ఉపసంహరించుకుని బిజెపిలో చేరిపోవడంతో కాంగ్రెస్‌కు అభ్యర్థి లేకుండా పోయారు. బిజెపికి గుణపాఠం నేర్పేందుకు ఓటర్లు ఇవిఎంలోని నోటా బటన్ నొక్కాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 72 ఏళ్ల ఇండోర్ లోక్‌సబ చరిత్రలో కాంగ్రెస్ పోటీలో లేకుండా పోవడం ఇదే మొదటిసారి. మే 13న ఇండోర్‌లో ఓటింగ్ జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు 213 సెప్టెంబర్‌లో ఇవిఎంలలో నోటా ఆప్షన్‌ను ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని నీల్‌గిరీస్‌లో నోటాకు 46,559 ఓట్లు లభించాయి. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఇవి 5 శాతం వరకు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News