Monday, December 23, 2024

వరసగా ఆరోసారి స్వచ్ఛ నగరంగా ఇండోర్ రికార్డు

- Advertisement -
- Advertisement -

Indore is the cleanest city for the sixth time in a row

తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ ముంబయి
రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌కు తొలిస్థానం
స్వచ్ఛతా సర్వే ఫలితాలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఇండోర్ నగరం వరసగా ఆరో సారి దేశంలోనే స్వచ్ఛ నగరంగా నిలిచింది. కాగా సూరత్, నవీ ముంబయి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది నిర్వహించే స్వచ్ఛతా సర్వే ఫలితాలను శనివారం ప్రకటించారు. ఇండోర్, సూరత్‌లు తమతమ స్థానాలను నిలబెట్టుకోగా, గత ఏడాది మూడో స్థానంలో నిలిచిన విజయవాడ ఆ స్థానాన్ని నవీ ముంబయికి కోల్పోయింది. కాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు2022 లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన రాష్ట్రాల కేటగిరీలో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వందకన్నా తక్కువ అర్బన్ లోకల్ బాడీలు ఉన్న రాష్ట్రాల కేటగిరీలో త్రిపుర తొలి స్థానాన్ని దక్కించుకుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి సహా పలువురు కేంద్రమంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తక్కువ జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రకు చెందిన పంచాగ్ని తొలి స్థానాన్ని దక్కించుకోగా, చత్తీస్‌గఢ్‌కు చెందిన పటాన్, మహారాష్ట్రకు చెందిన కరాడ్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. లక్షకన్నా ఎక్కువ జనాభా కలిగిన గంగానదీ ప్రాంత పట్టణాల్లో అత్యంత స్వచ్ఛ పట్టణంగా హరిద్వార్ నిలవగా, వారణాసి, రుషీకేశ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి, లక్షకన్నా తక్కువ జనాభా కలిగిన గంగా పట్టణాల్లో బిజ్నౌర్ తొలి స్థానంలో నిలవగా కన్నౌజ్, గర్‌ముక్తేశ్వర్‌లు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. కాగా మహారాష్ట్రకు చెందిన దేవోలాలి దేశంలో అత్యంత స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచిందిజ స్వచ్ఛ భారత్ మిషన్ (పట్టణ ప్రాంత) పురోగతిని అధ్యయనం చేయడానికి నిర్వహించిన ఈ సర్వేలో స్వచ్ఛత, పారిశుద్ధానికి చెందిన వివిధ కొలమానాల ఆధారంగా పట్టణ ప్రాంత స్థానిక సంస్‌తలకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. 2016లో తొలి సారి నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 73 నగరాలలో సర్వే నిర్వహించగా, ఈ ఏడాది మొత్తం 4,354 నగరాల్లో సర్వే నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News