Friday, December 20, 2024

తెలంగాణ రైతుల‌పై రేవంత్ కండ్ల మంట‌: ఇంద్రకరణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మొద‌టి నుంచి రైతులంటే కాంగ్రెస్ కు చిన్న‌చూపు

ఇవాళ రైతుల‌కు క‌రెంట్ ఎందుకన్న రేవంత్…రేపు రైతుబంధు, బీమా కూడా వ‌ద్దంటారు

కాంగ్రెస్ రైతు వ్య‌తిరేక విధానాల‌ను రైతాంగం తిప్పికొట్టాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్: వ్య‌వ‌సాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరాపై టిపిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన‌ అనుచిత వ్యాఖ్యలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ‌ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత‌ కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు. సిఎం కెసిఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌గొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ , టిడిపి పాల‌న‌లో క‌రెంట్ లేక రైతులు అరిగోస ప‌డ్డార‌ని, స్వ‌రాష్ట్రంలో పుష్క‌లంగా సాగునీరు, నాణ్య‌మైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్ళీ చీక‌ట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలను ప్ర‌జ‌లు తిప్పికొడ‌తార‌ని ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి హెచ్చ‌రించారు.

Also Read: రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మొద‌టి నుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్నచూప‌ని, మొన్న ధ‌ర‌ణి వ‌ద్ద‌న్నార‌ని, ఇప్పుడు వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌రిపోతుంద‌ని చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే … కాంగ్రెస్ రైతు వ్య‌తిరేఖ పార్టీ అని అర్ధ‌మ‌వుతుంద‌ని వ్యాఖ్య‌నించారు. ఇప్పుడు ధ‌ర‌ణి వ‌ద్ద‌ని, వ్య‌వ‌సాయానికి 3 గంట‌ల క‌రెంట్ చాలు అన్న రేవంత్ రెడ్డి రేపు రైతుబంధు, రైతు బీమా కూడా వ‌ద్దంటార‌ని ద్వ‌జ‌మెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పి బంగాళ‌ఖాతంలో క‌లపాల‌ని తెలంగాణ రైతాంగానికి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని మంత్రి అల్లోల పిలుపు

కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేప‌ట్టాల‌ని ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం, ప్ర‌జ‌లకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేర‌కు ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News