రంగారెడ్డి: అడవులను రక్షించడంతో పాటు పచ్చదనం పెంచాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రర్యటించారు. నాగారంలో అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఇంద్రాకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. పచ్చదనం పెంపుకోసం హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందని ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు హైదరాబాద్‌కు నలువైపులా వీటిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ కు 7 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం మండలం పెద్దపులి నాగారంలో 556.69 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.17 కోట్ల వ్యయంతో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను అభివృద్ధి చేశామన్నారు. ఎంట్రీ ప్లాజా, విజిటర్స్ పాత్వే, ఇంటర్ప్రెటేషన్ షేడ్ సఫారి ట్రాక్, గజేబో, వాచ్ టవర్, గ్యాప్ ప్లాంటేషన్, అటవీ ప్రాంతమంతా రక్షణ గోడ, బోర్ వెల్, పైప్ లైన్, ఇతర సౌకర్యాలను కల్పించామని ఇంద్రకరణ్ తెలిపారు.