Tuesday, December 17, 2024

దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

- Advertisement -
- Advertisement -

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పులకించారు. దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం దుర్గాదేవి. కోటిసూర్య ప్రభలతో వెలుగొందే ఈ దేవి భక్తులను సర్వదుర్గతుల నుంచి కాపాడుతుంది. ఈమె మహా ప్రకృతి స్వరూపిణి. ఈ తల్లి ఉపాసన ద్వారా ఈతి బాధలు నశిస్తాయి. గ్రహబాధలు తొలగుతాయి. ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలు, అక్షతలతో అమ్మను పూజించి, పులగం నివేదన చేయాలి. ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించాలి. దుర్గాసూక్తం, లలిత అష్టోత్తరం, దుర్గాస్తోత్రాలు పారాయణ చేయాలి. వేదపండితులను ఈరోజు సత్కరిస్తే అమ్మ సంతోషిస్తుంది.

అమ్మవారి అనుగ్రహంతోనే శాసన సభ్యునిగా ఎన్నికయ్యా : గత దశాబ్ద కాలంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల అభిప్రాయం ప్రకారం 95 శాతం మంది భక్తులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లు అద్భుతమని ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అతిపెద్ద ప్రశంస అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం జగన్మాత దుర్గాదేవి అలంకారాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనకదుర్గమ్మ వారు నివసిస్తున్న ప్రాంతానికి శాసన సభ్యునిగా ఎన్నిక కావడం దుర్గామాత అనుగ్రహమేనన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన, ఇంద్రకీలాద్రి దేవస్థానం కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావు,పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో అందిస్తున్న సహకారం వల్లే భక్తులు ఎంతో సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో దేవస్థానంపై జరిగే అన్ని ఉత్సవాల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది చేసిన ప్రయోగాలన్నీ విజయవంతం అయ్యాయన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు దేవాలయ సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం బహుకరించారు.

అమ్మవారిని దర్శించుకున్న ఆర్టీసీ చైర్మన్ : శ్రీ దుర్గా దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు మహబూబ్ మండపం వద్ద వేద ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీర్వచనం వల్ల తనకు ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కిందని తెలిపారు. రాష్ట్రానికి ఆర్టీసీ రథచక్రాలు వంటిదని, అమ్మవారి దయతో ఆర్టీసీ లాభాలతో సురక్షితంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News