ప్రతీకార చర్యలను ప్రకటించిన పాకిస్తాన్ సిమ్లాతో
సహా అన్ని ఒప్పందాలు రద్దు పాక్ గగనతలం
మీదుగా భారత్ విమానాల ప్రయాణంపై నిషేధం
భారతీయులకు సార్క్ వీసా పర్మిట్లు నిలిపివేత
భారత్‌తో వాణిజ్య లావాదేవీలకు బ్రేక్
ఇస్లామాబాద్ : పహల్గామ్ దారుణ దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల నేపథ్యంలో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము ప్రతిస్పందించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. దీంతో పాక్ భద్రతా వ్యవహారాల అత్యున్నత కమిటీ గురువారం సమావేశమై గంటల తరబడి చర్చించి భారతదేశంతో ప్రస్తుతం ఉన్న సిమ్లా ఒప్పందంతో సహా అన్న ఒప్పందాలనూ ప్రస్తుతానికి రద్దుచేసుకోవాలని నిర్ణయించింది. భారతదేశం పాకిస్తానీ పౌరులకు అన్ని వీసాలను రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇస్లామాబాద్ కూడా సార్క్ వీసా మినహాయింపు పథకం కింద భారతీయులకు జారీ చేసిన పర్మిట్లను నిలిపివేయాలని నిర్ణయించింది. హైకమిషన్ లోని భారత దౌత్య సిబ్బంది సంఖ్యను 30కి కుదించాలని నిర్ణయించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత నిర్ణయాన్ని మాత్రం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది.
దీనిని చావుదెబ్బగా భావించిన ఇస్లామాబాద్ మరో గత్యంతరం లోని పరిస్థితుల్లో ఈ ఒప్పందం ప్రకారం పాక్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడం నదీజలాల హక్కుల అతిక్రమణగా పేర్కొంది. దీనిని యుద్ధ చర్య గా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై నేషనల్ పవర్ స్పెక్ట్రం స్పందిస్తుందని మాత్రం పేర్కొంది. పాక్ లో ప్రవహించే సింధు, జీలం, చీనాబ్.. జలాలు పారకపోతే.. సగం దేశం ఎడారిగా తయారవుతుంది. కోట్లాది మంది పై దీని ప్రభావం పడుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ లో తీవ్రమైన నిటి కొరత ఉంది. భారత్ అశనిపాతం వంటి నిర్ణయంతో పాకిస్తాన్ కు చావుదెబ్బ తప్పదు. కానీ, పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. సిమ్లాతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల నిలిపివేత పాకిస్తాన్ హక్కుగా పేర్కొంది. కానీ, భారతదేశం తన నిర్ణయాలని విరమించుకునే వరకూ తామూ సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ఒప్పందాలను రద్దు చేసుకునే హక్కును వినియోగించుకొంటున్నట్లు పాక్ ఒక ప్రకటనలో తెలిపింది.