Friday, April 25, 2025

పాక్ జీవనాడులు తెగినట్టే

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి చిమ్మిన రక్తపుటేరులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జీవనాడులపై భారత్ తేరుకోలేని దెబ్బకొట్టింది. అదే సింధూ జలాల ఒప్పందాన్ని (ఇండస్ వాటర్ ట్రీటీ) సస్పెండ్ చేయడం. గతంలో పాక్‌తో 1965, 1971, కార్గిల్ యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగిన ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా నదుల జలాల సరఫరాలో పాకిస్థాన్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందం రద్దు కాకుండా భారత్ సహనం వహించింది.

కానీ ఈసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రతోడేళ్ల ఘాతుకానికి అభమూశుభమూ తెలియని పర్యాటకుల నెత్తుడిమడుగులో నేల కూలడం భారత్‌కు సహనం నశించి రక్తం మరిగి ఈ ప్రతీకార చర్య తీసుకుంది. ప్రపంచంలోనే అతి తక్కువ నీటివనరులున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఈ దేశానికి సింధు నదీజలాలే ప్రధాన నీటివనరు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ దేశంలో ఈ నదీ జలాలను కేవలం పంజాబ్ మాత్రమే వినియోగించుకుంటోంది. బలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. భారత్ నుంచి ఆ దేశానికి ప్రవహించే ఈ నదీ జలాల విషయంలో మన కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే పాకిస్థాన్ ఎడారిగా మారడం ఖాయం.

టిబెట్ నుంచి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, చైనా దేశాల మధ్య వివాదం ఉంది. 1947లో భారత్, పాక్ విడిపోయినప్పటికీ, వివాదం తగ్గలేదు. దీంతో పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పడానికి 1948లోనే పాకిస్థాన్‌కు భారత్ నీటి సరఫరా నిలిపివేసింది. దీంతో పాక్ విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి చొరవతో ప్రపంచ బ్యాంకు 1954లో ఈ నదీజలాల ఒప్పందాన్ని కుదిర్చింది. అయితే సింధూనదీ జలాలపై 1960 సెప్టెంబర్ 19లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ ఉపనదుల్లో భారత్‌కు తూర్పు వైపుగా ప్రవహించే నదులు బియాస్, రావి, సట్లైజ్‌లపై నియంత్రణ ఉంటుంది. అలాగే సింధు ఉపనదుల్లో పశ్చిమదిశగా ప్రవహించే సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు నియంత్రణ ఉంటుంది.

ఇవి కాకుండా బియాస్, సట్లైజ్ జలాలు కూడా వెళుతుంటాయి. భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్‌కు చేరేలా వాడుకోవలసి ఉంటుంది. జలవిద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించాలి. ఒప్పందం ప్రకారం పశ్చిమ వైపు నదులనుంచి స్వదేశీ అవసరాల కోసం నీటిని వినియోగించుకునే హక్కు భారత్‌కు ఉంది. అయితే నిల్వచేసే సామర్థం లేకపోవడంతో చట్ట ప్రకారం తన నీటి వాటాను భారత్ వినియోగించుకోలేకపోతోంది. 3.6 మిలియన్ ఎకరాల అడుగుల వరకు భారత్ నీటి నిల్వ సామర్ధం ఉంచుకోవచ్చు. అలాగే 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నా కేవలం 3482 మెగావాట్ల విద్యుత్‌నే భారత్ ఉత్పత్తి చేయగలుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్థాన్‌కే ఎక్కువ ప్రయోజనం కలిగిందనే వాదన వచ్చింది. 2016 ఉరీ ఉగ్రదాడి తరువాత భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ‘రక్తం నీరు కలిసి ప్రవహించలేవు’ అని తీవ్ర ఆందోళనతో భావోద్వేగం చెందడం గమనార్హం. ఒప్పందం కుదుర్చుకున్న నాటికి, ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అందువల్ల అప్పటి ఒప్పందాన్ని పునస్సమీక్షించాలని భారత్ పట్టుబడుతోంది.

ఈ మేరకు నోటీసులు జారీ చేసినా పాక్ నుంచి ఎలాంటి స్పందనలు రావడం లేదు. ఇప్పుడు ఒప్పందం నిలిపివేతకు భారత్ నిర్ణయించడం పాకిస్థాన్‌కు రానురాను తీవ్ర కష్టనష్టాలు తప్పవు. ఇకపై కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లైజ్ నదీ జలాలను పాకిస్థాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు నిర్మించుకునే వీలుంటుంది. కశ్మీర్ లోయలో జీలం నది వరదలు రాకుండా నిర్మాణాలు చేపట్టేలా స్వేచ్ఛగా చర్యలు తీసుకోవచ్చు. అప్పుడు పాకిస్థాన్‌కు కష్టాలు మరింత పెరుగుతాయి. పాకిస్థాన్‌లో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ నదుల జలాలే ఆధారం. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు ఈ నదుల నీటిపైనే మనుగడ సాగిస్తున్నాయి. ఒప్పందం ప్రకారం ఈ నదుల జలాల నుంచి 80% పాక్ వ్యవసాయానికి వినియోగిస్తోంది. దాదాపు 16 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి.

ఏటా 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్‌ఎఎఫ్) సాగునీరు సిందూ బేసిన్ నుంచే లభిస్తోంది. ఆహార భద్రతకు ఇదెంతో కీలకం. జీలమ్ నదిపై నిర్మించిన మంగల డ్యామ్ నుంచి పాకిస్థాన్‌కు ఏటా 8 శాతం విద్యుత్ ఉత్పత్తి లభిస్తోంది. సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్ నుంచి 16% విద్యుత్ లభిస్తోంది. ఇప్పుడు ఒప్పందం ఆగిపోతే 24% జలవిద్యుత్‌పై వ్యతిరేక ప్రభావం పడుతుంది. ఒప్పందం ప్రకారం లభించిన నీటిని నిల్వచేసుకునే సామర్థం పాకిస్థాన్‌కు లేకపోవడంతో మంగలా, తర్బెలా డ్యామ్‌లు కేవలం 14.4 ఎమ్‌ఎఫ్ నీటిని మాత్రమే నిల్వచేసుకోగలుగుతున్నాయి. పాకిస్థాన్ జిడిపిలో 25% ఈ నదుల నుంచే లభిస్తోంది. గోధుమ, వరి, చెరకు, పత్తి తదితర ముఖ్యమైన పంటలకు ఈ జిడిపి మద్దతు లభిస్తోంది. భారత్ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌లో ఆహార ఉత్పత్తి దెబ్బతింటుంది. కొన్ని లక్షల మందికి ఆహారభద్రత లేకుండా పోతుం ది. నగరాలకు తాగు నీటి సరఫరా లోపించి ప్రజల్లో అలజడి ఏర్పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి దెబ్బతిని గృహాలకు, పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా కాకపోవచ్చు. ప్రజలు చేసిన అప్పులు తీర్చలేక, నిరుద్యోగం పెరిగి, గ్రామీణ ప్రాంతాలనుంచి వలసలు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News