Monday, December 23, 2024

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని మార్చుకుందామంటూ పాక్‌కు భారత్ నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సింధూ నదీ జలాల ఒప్పందంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది దేశమైన పాక్‌కు భారత్ నోటీసు ఇచ్చింది. సింధూ శాశ్వత కమిషన్‌కు బాధ్యులైన కమిషనర్ల ద్వారా జనవరి 25న భారత్ ఈ నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐడబ్ల్యూటీ నిబంధనల సక్రమ అమలుపై పాక్ మొండి వైఖరికి నిరసనగా ఈ నోటీసులు పంపాల్సి వచ్చినట్టు భారత్ తెలిపింది.

సింధూ జలాల ఒప్పందం అమలుపై పరస్పర ఆమోదయోగ్యమైన మార్గంలో ముందుకు వెళ్దామని భారతదేశం పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పాక్ బేఖాతరు చేస్తోంది. శాశ్వత ఇండస్ కమిషన్‌పై 2017 నుంచి 2022 వరకూ ఐదు సమావేశాలు జరిగినా దీనిపై చర్చించేందుకు పాక్ నిరాకరిస్తూ వచ్చింది. కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు పాక్ మొండికేస్తోంది. పాకిస్థాన్ పట్టువిడుపులు లేని ధోరణిలో వ్యవహరిస్తుండంతో వరల్డ్ బ్యాంకు ఇటీవల తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రారంభించింది. అయితే, ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనల కారణంగానే ఒప్పంద సవరణకు పాక్‌కు భారత్ నోటీసులు పంపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, భారత్ నోటీసుతో 90 రోజులు లోగా ఇరుదేశాల మధ్య చర్చలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందువల్ల 62 ఏళ్లుగా నేర్చుకున్న పాఠాలతో ఐడబ్ల్యూటీని అప్‌డేట్ చేసేందుకు వీలవుతుందని భారత్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఇండియా-పాక్ మధ్య నదీజలాల పంపిణీకి సంబంధించి సింధూ నదీ జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగింది. దీనిపై అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ ప్రధాన మంత్రి అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్జెజ్ జలాలపై భారతదేశానికి, పశ్చిమ నదులైన సింధూ, చీనాబ్, జీలం నదులపై పాక్‌ నియంత్రణ ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితితులను మినహాయిస్తే ఎగువ నదులపై భారత్ ఎలాంటి నిల్వ లేదా నీటి పారుదల వ్యవస్థలను నిర్మించేందుకు వీలులేదని ఈ ఒప్పందం చెబుతోంది. రెండు దేశాల మధ్య సహకారం కోసం సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీనికి ఇరుదేశాల కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఏటా ఇరుదేశాల కమిషనర్లు రెండు సార్లు భేటీ అవుతారు. నదీజలాలపై కొనసాగుతున్న ప్రాజెక్టులను పర్యటించి తనిఖీ చేస్తారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు పాత్ర కూడా పరమితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News