కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం
పలు రాష్ట్రాలతో పారిశ్రామిక అనుసంధానం
ఇప్పటికే కేంద్రమంత్రికి, ప్రధానికి రాష్ట్రం నుంచి వినతి
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్- టు నాగ్‌పూర్, హైదరాబాద్ టు -వరంగల్‌ల మధ్య పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. త్వరలో దీనికి కేంద్రం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించి సిఎం కెసిఆర్‌తో పాటు రాష్ట్ర టిఆర్‌ఎస్ ఎంపిలు కేంద్రమంత్రికి, ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం పారిశ్రామిక కారిడార్లు లేవు. ఇతర రాష్ట్రాలతో అనుసంధానం కావాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. వీటిని సత్వరమే ఏర్పాటు చేస్తే పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రయాణం కూడా కలిసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణాశాఖకు విజ్ఞప్తి చేసింది.
రోడ్డు, రైల్వేలకు అనుకూలంగా..
హైదరాబాద్ టు నాగ్‌పూర్ మార్గంలో 585 కిలోమీటర్ల మార్గంలో వరంగల్ మార్గంలో 150 కిలోమీటర్లు రైల్వే మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారులు సైతం ఉన్నందున ఈ మార్గాలు పారిశ్రామిక కారిడార్లతో పాటు రోడ్డు, రైల్వేలకు అనుకూలంగా ఉంటుందని దీనిని పారిశ్రామిక కారిడార్లుగా గుర్తించింది. అందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని హైదరాబాద్ టు- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్న లక్షంతో రాష్ట్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.
రైల్వే, రోడ్డు మార్గంలో ట్రక్ టర్మినళ్ల నిర్మాణం
పారిశ్రామిక కారిడార్‌లకు తోడు రైల్వే, రోడ్డు కారిడార్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణ, అదనపు రవాణాతో పాటు ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ప్రాజెక్టులు వస్తాయి. ప్రస్తుతమున్న రైలు మార్గాల విస్తరణ, సమాంతరంగా గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక లైన్ల నిర్మాణం, రైల్వే మార్గంలో రైల్వే, రోడ్డు మార్గంలో ట్రక్ టర్మినళ్ల నిర్మాణం జరుగుతుంది. భూగర్భ రేవు (డైపోర్టు)ల స్థాపనకు వీలవుతుంది. కార్మికుల రాకపోకలు సులభమవుతాయి. ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు వెసులుబాటు కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన వినతిలో ఈ అంశాన్ని నివేదించింది.
కేంద్రానికి డిపిఆర్
వాస్తవానికి పారిశ్రామిక కారిడార్‌లకు అవసరమైన భూసేకరణ, పారిశ్రామిక వసతుల కల్పనంతా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే కేంద్రం చేపట్టిన పారిశ్రామిక కారిడార్ల పథకంలో మౌలిక వసతులకు సంబంధించి నిధులు సమకూరడంతో పాటు పెట్టుబడుల సమీకరణ సులువవుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని కోరింది. దీనికి సంబంధించి తెలంగాణ డిపిఆర్‌ను సైతం సిద్ధం చేసి కేంద్రానికి పంపింది. అక్కడి నుంచే వీటికి సంబంధించిన నిధులు మంజూరు కావాల్సి ఉండగా ఇంతవరకు కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జర్మనీల మాదిరిగానే
మరోమారు సిఎం కెసిఆర్ ఈ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సిఎం కెసిఆర్ ఇప్పటికే పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. పారిశ్రామిక కారిడార్లను విస్తరించి రైల్వే, రోడ్డు కారిడార్లను ఏర్పాటు చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జర్మనీ తదితర దేశాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణలోనూ ఈ కారిడార్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరో వెయ్యి ఎకరాల భూమి సేకరణ
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా జౌళిపార్కు కోసం మరో వెయ్యి ఎకరాల భూమిని సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇప్పటికే 1100 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. పార్కులో పరిశ్రమల స్థాపనకు కొత్త సంస్థలు ముందుకు వస్తుండడంతో డిమాండ్ మేరకు అదనంగా భూములను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2017 అక్టోబర్ 22వ తేదీన పార్కును ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిం చగా, తర్వాత అక్కడ రహదారులు, మౌలిక వసతులను కల్పించారు. ఇప్పటికే కొరియాకు చెందిన యంగ్వన్ సంస్థ, మరో నాలుగు సంస్థలు మెగా జౌళిపార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన కైటెక్స్ సంస్థ సైతం రూ. వెయ్యి కోట్లతో పార్కులో వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాగా ప్రభుత్వం దాని ప్రతిపాదనలను పరిశీలించి భూకేటాయింపుతో పాటు రాయితీలు, ప్రోత్సాహాకాలకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే చాలా సంస్థలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపు తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నాయి.