Monday, November 25, 2024

అప్పుడు..ఇప్పుడు మార్పు చూడండి

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్ : పారిశ్రామిక రంగ అభివృద్ధ్దిలో నేడు తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి కెటిఆర్ అన్నారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో మంగళవారం నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా ఆయన పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన 51 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. గత 2014కు ముందు తెలంగాణలో పారిశ్రామిక రంగం పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గడిచిన కెసిఆర్ 8 ఏళ్ల పాలనలో విద్య, వైద్యం, ఆరోగ్యం, సాగు త్రాగునీరు, సంక్షేమం, పరిశ్రమలు, ఇలా అన్ని రంగాల్లో ముందు వరసలో నిలిచామన్నారు. అద్భుతమైన పాలనను కెసిఆర్ ఆవిష్కరించారని, జాతీయ స్థాయిలో జరిపిన పలు సర్వేల్లో తెలంగాణ మొదటి ర్యాంకులను సాధించిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టిఎస్ ఐ పాస్ విధానం ప్రవేశపెట్టి అర్హులైన వారికి కేవలం 15రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరుగు తుందన్నారు. ఇంతటి వేగ వంతమైన విధానం ప్రపంచంలోనే ఎక్కడా లేదని ఆయన తెలిపారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడమే గాదు.. వారికి అవసరమైన విద్యుత్‌ను కూడా అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధ్దిలో వేగంగా దూసుకు పోతున్న తెలంగాణ నేడు దేశానికే పాఠాలు నేర్పే స్థాయికి ఎదిగిందన్నారు.

గడిచిన 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేవలం 8 ఏళ్ల పాలనలో కెసిఆర్ చేసి చూపించారని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో హరితహారం ద్వారా కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులోని కంపెనీల ద్వారా మునుగోడు, భువనగిరి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు చెందిన సుమారు 40 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఇక్కడి పరిశ్రమల నిర్వాహకుల కోరిక మేరకు కొయ్యలగూడెం నుంచి మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి వారికి అవసరమైన మంచి నీటిని అందిస్తామన్నారు. ఏదేమైనా గడిచిన 8 ఏళ్లలో తెలంగాణలో తీసుకువచ్చిన మార్పును ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. దేశం గర్వపడే విధంగా అన్ని రంగాలను అభివృద్ధి చేశామని చెప్పారు.

భవిష్యత్తులో కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ఎన్నో అద్భుతాలను సాధించే దిశగా మరింత ముందుకు సాగుతామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గింగిడి సునీత, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, టిఎస్‌ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, టిఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News