Monday, December 23, 2024

అసమానతలే అసలైన వైరస్

- Advertisement -
- Advertisement -

Inequalities are the real virus: Chinna Jeeyar Swamy

దీనికి వెయ్యేళ్ల క్రితమే రామానుజాచార్యులు వ్యాక్సిన్‌ను అందించారు

అదే సమానతా
వ్యాక్సిన్
పరస్పరం కలిసి ఉండే
వాతావరణాన్ని ప్రస్తుతం
సమాజంలో
చూడలేకపోతున్నాం
రేపటి నుంచి 14వరకు
శ్రీరామనుజ సహస్రాబ్ధి వేడుకలు ప్రధాని
మోదీతో పాటు
ప్రముఖుల హాజరు
త్రిదండి
చినజీయర్ స్వామి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న భయంకరమైన వైరస్ అసమానత అని, ఒక వ్యక్తి మరో వ్యక్తిని గౌరవించలేకపోతున్నాడని, ఇలాంటి ప్రమాదకరమైన వైరస్ అందరి మనసులో వ్యా పించి ఉందని త్రిదండి చినజీయర్ స్వామి పేర్కొన్నా రు. ఇలాంటి వైరస్‌కు వ్యాక్సిన్‌ను వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు అందించారని, అదే సమానతా వ్యాక్సిన్ అని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న శ్రీరామనుజ సహస్రాబ్ధి వేడుకల వివరాలను ఆయన మీడియా సమావేశంలో సోమవారం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర పలు రాష్ట్రాల సిఎంలు, ఫీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని తిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.

కులాలు, మతాల మధ్య అసమానత

శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిన్నజీయర్ స్వామి మాట్లాడు తూ ధనంలో, జ్ఞానంలో హెచ్చుతగ్గులు ఉంటాయని, ఇవన్నీ ఉంటున్నా ఒకే సమాజంగా మానవులు బ్రతకాలన్నారు. సమాజంలోని కులాలు, మతాల మధ్య ప్రస్తుతం అసమానత కొరవడుతోందన్నారు. పరస్పరం కలిసి ఉండే వాతావరణాన్ని చూడలేకపోతున్నామన్నా రు. ఇది కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్ అన్నారు. వైరస్‌నే కాకుండా మానవ మనసులో దాగిన వైరస్‌ను తొలగించడానికిముఖ్యమైన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన తెలిపారు.

మాధవ సేవే సకల కోటి సేవగా భావించాలి

కోవిడ్ పరిస్థితుల్లో ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అద్భుతమైన 1035 కుండాలతో హోమాలు జరుపుతున్నామన్నారు. 12 రోజుల పాటు అద్భుతమైన యాగాలు చేసుకోబోతున్నామని ఇది శాస్త్రీయమైన, వైదిక విధానమన్నారు. రాబోయే తరాలకు రామానుజాచార్యుల స్ఫూర్తిని నింపాలన్న ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. మనిషి అవసరానికి మించి ప్రకృతిని నాశనం చేస్తున్నాడని, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఒక్కో ఉనికి ఉందని, వాటికి హాని కలిగించకుండా కాపాడాలన్నారు. మాధవ సేవే సకల కోటి సేవగా భావించాలని ఆయన సూచించారు.

మహిళా సాధికారత కోసం రామానుజాచార్యుల కృషి

మనం చేసే మంచి పనులతో ప్రకృతి పులకిస్తుందని, వానలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, వెయ్యి ఏళ్ల క్రితం శ్రీ రామానుజాచార్యులు సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టారని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. అస్పృశ్యత మహమ్మారి ఇప్పటికీ వ్యాపించి ఉందని, వెయ్యేళ్ల క్రితం ఇంకా ఎలా ఉండేదో ఊహించుకోవాలన్నారు. ఆలయాల్లోకి దళితులను రానిచ్చేవారు కాదనీ, అలాంటి సమాజంలో రామానుజాచార్యులు ప్రతి వ్యక్తి భగవంతుడి సంతానమే అని బోధించారన్నారు.

అందరినీ ఆలయాల్లోకి ప్రవేశం కల్పించి…

వ్యక్తిలో ఉండే గుణం ప్రధానం కానీ…కులం ప్రధానం కాదనీ రామానుజాచార్యులు బోధించారన్నారు. అందరినీ ఆలయాల్లోకి ప్రవేశం కల్పించిన భారతీయ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి రామానుజాచార్యులని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. 16వ శతాబ్దం వరకు రామానుజాచార్యులు చూపిన మార్గంలో నడుచుకున్నారు కానీ, ఆ తరువాత రకరకాల దాడులతో ప్రజల్లోని కలయికను తొలగించారన్నారు. మతం వ్యక్తుల వికాసానికి, సామాజిక సంఘర్షణకు ఉపయోగపడాలన్నారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.

శరీరంలోని అన్ని భాగాలు ఆధిపత్యం చెలాయించవు

శరీరంలోని అన్ని భాగాలు ఒకేలా ఉండవు. ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చెలాయించవని అవి సమన్వయంతో పని చేస్తాయని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. సమాజంలో ఎన్నో కులాలు, మతాలు, జాతులు ఎన్నో అంతరాలు ఉన్న వ్యక్తులు ఉంటారని, అందరూ సమన్వయంతో కలిసి బ్రతకాలని దీనినే సమానతా అంటారన్నారు. ఇది వెయ్యేళ్ల క్రితం రామానుజాచార్యులు చెప్పిన సమతా సూత్రమని త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు. ఎందులోనూ వివక్ష ఉండకూడదన్నదే రామానుజాచార్యుల సమతా స్ఫూర్తి అని, సమాజానికి సమతా స్ఫూర్తి, సమతా సూత్రం ప్రతి మనిషికి మందుగా కావాలన్నారు.

రామానుజాచార్యులు ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు….

రామానుజాచార్యులు ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదనీ, సాంఘిక విప్లవాన్ని అందించిన మహనీయులన్నారు. ఆయన సమత స్ఫూర్తికి ఆకారమన్నారు. భారతదేశపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు రామానుజాచార్యులని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. ప్రపంచంలో సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తుల సమాచారాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు. మంచి రోజులు వస్తున్నాయని దానికి నూతన విద్యా విధానమే నిదర్శనమన్నారు. ఇటీవల ప్రకటించిన నూతన జాతీయ విద్యావిధానం మంచి మార్పులకు శ్రీకారం చుట్టబోతోందన్నారు. ఇది మానవ జాతి చేసుకున్న అదృష్టమన్నారు. ఆజాదీకా అమృతోత్సవాల్లో మహానీయుల గొప్పతనం తెలుసుకుంటున్నామన్నారు.

108 దివ్య క్షేత్రాల మట్టిని

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీ రూపొందిస్తున్నామన్నారు. భారత్, నేపాల్ లోని 108 దివ్యదేశాలను రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసుకున్నామని త్రిదండి తెలిపారు. అక్కడి వరకు వెళ్లలేని వాళ్లు ఒకే దగ్గర ఇక్కడ అన్ని దివ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. ఆయా క్షేత్రాల్లోని సాలగ్రామాలను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోని మట్టికి ఒక అద్భుతమైన రుచి, వాసన ఉంటుందని, అలా 108 దివ్య క్షేత్రాల మట్టిని ఇక్కడ తీసుకొచ్చామన్నారు.

ఒకటిన్నర లక్షల కిలోల దేశీ ఆవుల పాలతో…

శ్రీ లక్ష్మీనారాయణ యాగంలో ఒకటిన్నర లక్షల కిలోల దేశీ ఆవుల పాలతో చేసిన నేతిని యజ్ఞం కోసం ఉపయోగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంతో ప్రకృతిలో మార్పు వస్తే జీవకోటి బాగుపడుతుందన్నారు. 5 వేల మంది రుత్వికులు యజ్ఞయాగాదుల్లో పాల్గొంటారన్నారు. 12 రోజుల పాటు నాలుగు వేదాలను రుత్వికులు పారాయణం చేస్తారన్నారు. మానవ జాతి మనుగడ కోసం ఇక్కడ పారాయణాలు జరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టులో తొమ్మిది సంఖ్య ఆధారం చేసుకొని నిర్మాణాలు చేశామని, రామానుజాచార్యుల విగ్రహం ఆకృతి కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారని త్రిదండి తెలిపారు. ఈ విగ్రహ వేదిక 54 అడుగులు, ఎత్తు 54 అడుగులు, రామానుజాచార్యుల చేతిలో ఉండే దండన 162 అడుగులు, మెట్లు 108, దివ్యదేశాలు 108 ఇలా ప్రతిదీ 9 సంఖ్యతో ముడిపడి ఉందన్నారు.

శ్రమ పడాలి, సాధించాలి, సమాజానికి అందించాలి

ఆ సమతామూర్తి సిద్ధాంతాలు నేటి సమాజానికి అవసరమని సమాజంలో ప్రస్తుతం ఉన్న స్థితికి సమతా స్ఫూర్తి ఒక మందు అని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. శ్రమ పడాలి, సాధించాలి, సమాజానికి అందించాలన్నదే రామానుజాచార్యులు సిద్ధాంతమన్నారు. ప్రపంచంలో ప్రతి విషయం ముఖ్యమేనని. సర్వప్రాణి సేవే నినాదంగా రామానుజాచార్యులు ముందుకు సాగారన్నారు. కర్ణాటకలో ఓ సారి కరవు సంభవిస్తే అక్కడ జలాశయాన్ని రామానుజాచార్యులు ఏర్పాటు చేశారన్నారు. నేడు నీటి బిందువులు కాపాడుకుందామంటూ ప్రతిజ్ఞలు, నీటి కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వ్యక్తిలో ఉన్న గుణం తప్ప కులం కాదనీ, జ్ఞానం తప్ప జాతి ముఖ్యం కాదన్నారు. అందులో భాగంగానే రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ వచ్చిందని భావిస్తున్నామన్నారు.

216 అడుగుల విగ్రహం ఏర్పాటు

రామానుజాచార్యుల సిద్ధాంతాలు ఇప్పుడు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి సమానత్వాన్ని ప్రబోధించడానికే సమతామూర్తి కేంద్రం నిర్మించామన్నారు. సమానత్వం కోసం కృషి చేసిన వ్యక్తుల చరిత్ర సమతా స్ఫూర్తి కేంద్రంలో ఉంటుందన్నారు. అందరం సమానమే, కులం అనే హద్దులు దాటుదాం అనే భావనను చాటుకుందామన్నదే రామానుజాచార్యుల సిద్ధాంతం. ఆయన సిద్ధాంతాలు ఇప్పుడు అత్యవసరం. అందుకే 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. సమతామూర్తి కేంద్రంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 108 దివ్య దేశాలను దర్శించుకునే వాళ్లు రామానుజాచార్యుల అంత ఎత్తుకు ఎదగాలన్నదే తన భావనఅని చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News