న్యూఢిల్లీ : డేటా వినియోగంలో అసమానతలు తొలగించాలంటే ప్రజాస్వామికీకరణ జరగాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. జీ 20 డెవలప్ మినిస్టర్స్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డిజిటలైజేషన్ వల్ల భారత దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, భాగస్వామ్య దేశాలతో తన అనుభవాలను పంచుకోడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరంలో ఉన్న వారికి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండే విధంగా మల్టీ లేటరల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో సంస్కరణలు రావాలన్నారు. అర్ధవంతమైన రూపకల్పన , ఆ విధానాలను సమర్ధవంతంగా ప్రజలకు చేరవేయడానికి అత్యున్నత స్థాయి నాణ్యత గల డేటా అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు.
భారత దేశంలో డిజిటలైజేషన్ వల్ల విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రజలను సాధికారులను చేయడానికి ఉపకరణంగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్టు పేర్కొన్నారు. 100 కు పైగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌లో అభివృద్ధిని వేగవంతం చేయడానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఈ జిల్లాలు దేశాభివృద్ధికి కీలకంగా మారాయన్నారు. జీ 20 డెవలప్‌మెంట్ మినిస్టర్స్ సమావేశం వారణాసిలో జరుగుతోంది. ప్రజాస్వామ్య మాత వికసించిన అత్యంత ప్రాచీన నగరం వారణాసి అని, అనేక శతాబ్దాలుగా విజ్ఞానం, చర్చలు, సంభాషణలు, వాదోపవాదాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు కేంద్రం వారణాసి అని, భారత దేశ వైవిధ్యభరితమైన వారసత్వ సంపదకు సారం ఈ నగరమని ప్రశంసించారు. దేశం లోని అన్ని ప్రాంతాల వారు కలిసే చోటు ఈ నగరం అని పేర్కొన్నారు.