Monday, December 23, 2024

ఆడశిశువును బతకనిద్దాం

- Advertisement -
- Advertisement -

నేటి బాలలే రేపటి పౌరులు. బాలల పెంపకంపైననే వారి సంపూర్ణ శారీరక, మానసిక ఎదుగుదల ఆధారపడి ఉంటుం ది. శిశు పోషణ వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యం నిర్ణయించబడుతుంది. బాలల సమగ్రాభివృద్ధిలో తల్లిదండ్రుల బాధ్యత అధికంగా ఉంటుంది. విశ్వమానవాళికి సురక్షిత జీవనం, ఆరోగ్యం, ఆహారం, విద్య, మానవీయత లాంటి మౌలిక హక్కులు ఉంటాయి. ప్రపంచ దేశాల్లో 385 మిలియన్ల బాలలు దారిద్య్రరేఖ దిగువన, 153 మిలియన్ల అనాథలు దుర్భర జీవితాన్ని గడపడం విచారకరం. వీరిలో రోజుకు 8,500 మంది బాలలు పోషకాహార లోపంతో మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పిల్లలకు పోషకాహార లోపం, వస్త్రాల లభ్యతలో కొరత, అనారోగ్య సమస్యలు, అవిద్య, అలక్ష్యం, బాల కార్మిక వ్యవస్థ, లైంగిక వేధింపులు, ఇంటర్‌నెట్ అశ్లీలత లాంటి సమస్యలు వెన్నాడుతూనే ఉన్నా యి. విశ్వబాలల సమస్యలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని 1982 నుంచి ప్రతి యేటా 1 నుంచి 7 సెప్టెంబర్ వరకు రోజున జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

సెప్టెంబర్ మాసాన్ని జాతీయ పోషకాహార మాసంగా కూడా పాటిస్తారు. జాతీయ పోషకాహార వారోత్సవాలు- 2023 నినాదంగా అందరికీ అందుబాటులో సమతుల్య పోషకాహారం (హెల్దీ డయట్ గావింగ్ ఎఫర్డబుల్ ఫర్ ఆల్) అనబడే అంశాన్ని తీసుకున్నారు.
భారత దేశంలో గత రెండు దశాబ్దాలుగా పేదరికం 21 శాతం తగ్గడం, శిశు మరణాలు సగానికి పైగా కట్టడి కావడం, 80 శాతానికి పైగా గర్భిణులు ఆసుపత్రుల్లో ప్రసవించడం లాంటి అనుభవాలతో పాటు 2 మిలియన్ల పిల్లలు బడులకు దూరమైపోవడం వంటి విభిన్న వాస్తవాలు బయట పడ్డాయి. దీనికి తోడుగా నిన్నటి కోవిడ్ -19 కల్లోలం కారణంగా ఉద్భవించిన సామాజిక, ఆర్థిక ప్రభావంతో అదనంగా మిలియన్ల 5 సంవత్సరాల లోపు వయస్సు గల బాలలు ప్రమాదకర పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, సగానికి పైగా బాలల మరణాలు నమోదు అవుతున్నాయని ‘యూనిసెఫ్- 2020 నివేదిక’ కఠిన వాస్తవాలను వెళ్లడించడం విచారకరం. ప్రతి ముగ్గురు బాలల్లో ఒక్కరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలలకు కరోనాలాంటి అనేక అంటువ్యాధులు తొందరగా సోకుతాయని తెలుపుతున్నారు.

కడు పేదరికం, పని దొరక్కపోవడం, ఆహార అభద్రత కారణాలు బాలల ఆరోగ్యంపై విష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విపత్తులు, ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి ప్రతికూలతల ఫలితంగా పోషకాహార సరఫరా దెబ్బతిని, ధరలు పెరగడంతో బాలలు కనీస పోషకాహారానికి దూరం అవుతూ, తీవ్ర పోషకాహారలోప స్థితితో 38.4 శాతం బాలల శారీరక అభివృద్ధి ఆగిపోయిన కారణంగా వయస్సు కన్నా అతి తక్కువ ఎత్తుతో (స్టంటింగ్) పొట్టి వాళ్ళలా మారుతున్నారని కూడా గుర్తించారు.

ప్రకృతి విరుద్ధ లింగ నిష్పత్తి
మన దేశంలో మగ శిశువుల కన్నా ఆడ శిశు మరణాలు ఎక్కువగా నమోదు కావడం బాధాకరం. దీని కారణంగా మగ ఆడ పిల్లల నిష్పత్తి 1000: 900 ఉండడం ప్రకృతి విరుద్ధమని తెలుసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా 5 ఏండ్ల లోపు బాలురు 7 శాతం మరణిస్తే, ఇండియాలో 11% బాలికలు మరణిస్తున్నారు. గ్రామీణ, పట్టణ మురికివాడలు, యస్‌సి, యస్‌టి, పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పోషకాహార లోపం, ఆరోగ్యవసతుల లేమి, బాల్య వివాహాలు, పాఠశాలలకు పిల్లలు దూరమవడం, పరిసరాల, వ్యక్తిగత అపరిశుభ్రత, సురక్షిత తాగునీరు లేకపోవడం లాంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. దేశ కౌమారదశ (10 19 ఏండ్ల) పిల్లల జనాభా 253 మిలియన్లు ఉన్నది. బాల్యవివాహాలు చేసుకున్న కూతుర్ల సంఖ్యలో ప్రపంచ దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది.

వీరిలో అనారోగ్యం, చిన్నతనంలోనే తల్లికావడం, పోషకాహారం అందకపోవడం, ఆర్థిక వెనుకబాటు, సంతానం బలహీనంగా ఉండటం వంటి సమస్యలు వెన్నాడుతాయి. కౌమారదశ బాలికల్లో 54%, 30 శాతం బాలురు రక్తహీనత సమస్యలతో సతమతం అవుతున్నారు. మన దేశంలో 60- 90 శాతం బాలికలు ఏదో ఒక సందర్భంలో లైంగిక అత్యాచారాలు, హింసలు లేదా వేధింపులను అనుభవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 191 దేశాల మానవ అభివృద్ధి సూచిక- 2023 జాబితాలో ఇండియా 132వ స్థానంలో ఉన్నది. భారత దేశ భాగ్యవిధాతలుగా ఎదగాల్సిన బాలలు ఆహార కొరత, పోషకాహారలోపం, అనారోగ్యం, అవిద్య, బాలకార్మిక వ్యవస్థ, బాలల లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు లాంటి తీవ్ర సమస్యలతో సంసారం చేస్తున్నారు.
పోషకాహార అభద్రత
కరోనాకు ముందు ప్రపంచ వ్యాప్తంగా 47 మిలియన్ల బాలలు పోషకాహార(వేస్టింగ్) సమస్యలతో సహ జీవనం చేస్తే, ప్రస్తుత కరోనా అనంతర కాలంలో వారి సంఖ్య 54 మిలియన్లకు చేరడం మెుదటిసారి ఈ మిలినియంలో జరిగింది. కరోనా వ్యాప్తితో పేద దేశాలలో పోషకాహార లోపంతో బాధపడుతున్న 5 ఏండ్ల లోపు బాలల సంఖ్య 14.3 శాతం పెరిగిందని గుర్తించారు. దీని పర్యవసానంగా సగానికి పైగా బాలలు పోషకాహారలోపంతో మరణిస్తున్నారని అనుమానిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా 250 మిలియన్ల బాలలకు విటమిన్- ఎ అందలేదని, దాదాపు 25% వరకు పోషకాహార లోపం పెరిగిందని తేల్చారు. వీటి ఫలితంగా 1.28 లక్షల అదనపు బాలల మరణాలు జరుగవచ్చని విశ్లేషించారు.

గర్భిణులకు అందవలసిన సమతుల పోషకాహారం అందక పోవడం కూడా పరిస్థితి తీవ్రతను మరింత జటిలం చేస్తుందని నివేదిక తెలుపుతోంది. బాలలకు జీవించడం, శారీరకంగా మానసికంగా ఎదగడం, వేధింపుల నుండి రక్షణ, అభివృద్ధిలో పాలు పంచుకోవడమనేవి రాజ్యాంగ హక్కులని గుర్తించింది. ఆకలి, అకాల మరణాలు, అత్యాచారాలు, బాల కార్మిక దురాచారం, అవిద్య, పోషకాహారలేమి లాంటి సవాళ్ళను దేశం సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉంది. మన దేశంలో 2012- 17 మధ్య కాలంలో 2.43 లక్షల బాలికలు /మహిళలు కనబడకుండా పోయారని విషయం విస్మయాన్ని కలుగజేస్తున్నది.
బాలల పరిరక్షణ మన బాధ్యత
విపత్తు అనంతర కాలంలో రేపటి పౌరుల పోషకాహార హక్కులను కాపాడేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు వెంటనే స్పందించాల్సి ఉంది. ఆహార ఉత్పత్తి రంగాల ప్రోత్సాహం, ఆహార సరఫరా నియంత్రణ, తల్లిపాల రక్షణ, బాలలకు, తల్లులకు సమతుల ఆహార లభ్యతలను కాపాడాల్సి ఉంది. బాలల్లో పోషకాహార లోపాల్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం, పేద కుటుంబాలకు ఆహారాన్ని ఇంటి వద్దనే పంపిణి చేయడం, పాఠశాలల్లో సురక్షిత మధ్యాహ్న భోజనం కల్పించడం లాంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యూనిసెఫ్ ప్రణాళిక ప్రకారం కోవిడ్- 19 ధాటికి తట్టుకుంటున్న విశ్వమానవాళి,

ముఖ్యంగా ఐదేళ్ల లోపు బాలలను రక్షించుకోవడానికి రెస్పాండ్ (స్పందించు), రికవర్ (క్షేమంగా బయటపడడం), రీ ఇమేజింగ్ (తిరిగి రూపాన్నివ్వడం) అనబడే త్రి సూత్రాలను ప్రతిపాదించారు. బాలల సమస్య జటిలం కాక ముందే తగు చర్యలు తీసుకోవడం, సమస్యలతో సతమతమవుతున్న వారిని రక్షించుకోవడం, బయటపడిన వారిని సంరక్షించుకోవడం అనే విషయాలకు కట్టుబడి మాతా, శిశ ఆరోగ్యాలను చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉందని నమ్ముదాం. రేపటి తరాన్ని పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటూ, ఆరోగ్యకర యువ శ్రేష్ట భవ్య భారతాన్ని నిర్మించుకుందాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News