Wednesday, January 22, 2025

అపార్ట్‌మెంట్ వద్ద పసికందు..

- Advertisement -
- Advertisement -

మానవత్వం చాటుకున్న కుషాయిగూడ ఎస్‌ఐ సాయికుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : కుషాయిగూడ ఎస్‌ఐ సాయికుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు రోజుల పసికందును ఆదివారం వదిలేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు, పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. శిశువును గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు పసికందు ప్రాణాలతో ఉందని, త్వరగా రావాలని పోలీసులను కోరారు. అదివరకే అపార్ట్‌మెంట్ వాసులు 108కి సైతం సమాచారం అందించారు. అంబులెన్స్ కంటే ముందుగా కుషాయిగూడ ఎస్‌ఐ సాయికుమార్ క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పసికందును చూసి చలించిపోయిన ఎస్‌ఐ చిన్నారికి అత్యవసరంగా వైద్యం అందించాలని రోడ్లపై పరుగులు పెట్టారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ రోజుల పసికందును మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. రోజుల చిన్నారి, అందులోనూ ఎందుకు పసికందును వదిలేశారోనన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేశారు. అయితే పసికందు ప్రాణం కాపాడేందుకు పరుగులు పెట్టి, ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఎస్‌ఐ సాయికుమార్ మానవత్వాన్ని చాటుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. పక్కన అపార్ట్‌మెంట్ నుంచి పసికందును ఎవరో పడేశారని, చిన్నారి పడటంతో శబ్ధం వచ్చిందని స్థానికులు పోలీసులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News