వ్యాక్సిన్ మిక్సింగ్‌పై లాన్సెట్ మరో నివేదిక
లండన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చినప్పటికీ వాటి పని తీరుపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్‌లను కలిపి తీసుకోవడం పైనా అధ్యయనాన్రాఉగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు డోసుల్లో ఒకేరకమైన టీకా తీసుకోవడంతో పోలిస్తే మిక్స్‌డ్ విధానంలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కొవిడ్ 19 ను సమర్ధంగా ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. అలా వేర్వేరు డోసులు తీసుకోవడం వల్ల వైరస్ ముప్పు తగ్గుతున్నట్టు తేలింది.స్వీడన్‌లో చేపట్టిన ఈ అధ్యయన నివేదికను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ యూరప్ విభాగం ప్రచురించింది. అంతకు ముందు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ జరిపిన ప్రయోగాల్లోనూ ఇదే విధమైన ఫలితాలు వెలువడ్డాయి. మిశ్రమ టీకా డోసులను తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలను తెలుసుకునేందుకు స్వీడన్‌కు చెందిన ప్రజారోగ్య విభాగం సమాచారాన్ని విశ్లేషించారు. ఇందులో భాగంగా దాదాపు 7 లక్షల మంది పౌరుల సమాచారాన్ని పరిగణ లోకి తీసుకున్నారు. సెకండ్ డోసు తీసుకున్న తరువాత రెండున్నర నెలల వరకు వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఇందులో భాగంగా ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలను కలిపి తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ ముప్పు 67 శాతం తగ్గుతున్నట్టు గుర్తించారు.ఇక ఆస్ట్రాజెనెకా, మోడెర్నాలు తీసుకోవడం వల్ల 79 శాతం, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసుల్లో తీసుకోవడం వల్ల కేవలం 50 శాతం మాత్రమే తగ్గుతోందని స్వీడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వెక్టార్ ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్‌లను రెండు డోసుల్లో తీసుకోవడం కంటే వెక్టార్ ఆధారిత వ్యాక్సిన్‌ను తొలిడోసులో ఎంఆర్‌ఎన్‌ఎ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్‌ను రెండో డోసులో తీసుకోవడం వల్ల వైరస్ వల్ల కలిగే ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు స్వీడన్ లోని ఉమేయా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ పీటర్ వార్డ్‌స్నామ్ పేర్కొన్నారు. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడం లోనూ ఈ విధానం సమర్ధంగా పనిచేస్తోందని అన్నారు.