కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి దేశంలో వినియోగిస్తున్న వ్యాక్సిన్ల వల్ల పురుషులు, మహిళల్లో వంధ్యత్వం(సంతానలేమి) ఏర్పడుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలేమీ లేవని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్లన్నీ సురక్షితం, సమర్థవంతమని పేర్కొన్నది. పునరుత్పత్తి వయసులోని వారికి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుందంటూ ప్రచారమైన వదంతుల్ని కేంద్రం త్రోసిపుచ్చింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు(నర్సులు, వగైరా)లో ఈ రకమైన వందంతుల్ని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసినట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. పోలియో, మశూచి, రుబెల్లా వ్యాక్సిన్ల విషయంలోనూ ఇలాంటి వదంతుల్నే వ్యాప్తి చేశారని గుర్తు చేసింది. వ్యాక్సిన్లను మొదట జంతువుల్లో పరీక్షించి, మానవులపై మదింపు జరుపుతారని, సైడ్ ఎఫెక్ట్ లేవని తేలినపుడే సార్వత్రిక వినియోగంలోకి తెస్తారని కేంద్రం వివరించింది. పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత ఎప్పుడైనా వారు తమ బిడ్డలకు పాలివ్వ వచ్చునని భరోసా కల్పించింది.