Monday, December 23, 2024

దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం!

- Advertisement -
- Advertisement -

Inflation decreased in India

అదుపుగాని ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ప్రధాని నరేంద్రమోడీ ఆందోళన చెందుతున్నారా? జనానికి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నా ఇంతవరకు వాటి గురించి ఎందుకు నోరు విప్పటం లేదు? జూలై నెలలో చిల్లర ద్రవ్యోల్బణం గత ఐదు నెలల కనిష్ట స్థాయి 6.71 శాతానికి తగ్గిందన్నది ప్రభుత్వ ప్రకటన. అనేక మంది హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకు అంటే ఆహారం, మరికొన్ని వస్తువుల ధరలు కాస్త తగ్గటమే కారణం. ద్రవ్యోల్బణాన్నే ధరల పెరుగుదల సూచికగా కూడా తీసుకోవచ్చు. సూచిక తగ్గుదల పెరుగుదలను ఎలా చూడాలి. జూన్ నెలలో ఇది 7.1 శాతంగా ఉన్నది జూలైలో 6.71కు తగ్గింది. ద్రవ్యోల్బణం లెక్కింపుకి వంద వస్తువుల ధరలను ప్రమాణంగా తీసుకుంటే వాటి ధర రూ. 100 అనుకుంటే జూన్ నెలలో పెరుగుదల ప్రకారం రూ. 107.10కి పెరిగితే జూలైలో రూ. 106.70 ఉంటుంది. అంటే నలభై పైసలు తగ్గింది. వంద వస్తువుల్లో కొన్నింటి ధర సగటు కంటే తగ్గవచ్చు, కొన్ని పెరగవచ్చు. ఇలా పన్నెండు నెలల వివరాలను సగటుగా తీసుకొని వార్షిక ద్రవ్యోల్బణాన్ని ఖరారు చేస్తారు. ఈ మేరకు 2014 నుంచి 2021 వరకు ఎనిమిదేండ్ల సగటు 4.87 శాతంగా ఉంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న నాలుగు శాతం లోపు మూడు సంవత్సరాల్లో మాత్రమే ఉంది. తగ్గుదలకు కారణం తమ ప్రతిభే అనుకుంటే పెరుగుదల కీర్తి కూడా వారిదే మరి !

ద్రవ్యోల్బణం నాలుగు శాతంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐని ఆదేశించింది. షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దానికి రెండు శాతం అటూ ఇటైనా ఫరవాలేదని చెప్పింది. అంటే ఏటా నాలుగు నుంచి ఆరు శాతం మేరకు ధరలను పెరగనివ్వవచ్చు అన్నది ప్రభుత్వ విధానం. అది నరేంద్ర మోడీ లేదా మరొకరు ఎవరున్నా సేవ్‌ు టు సేవ్‌ు అన్నట్లుగా అలాంటి లక్ష్యాలనే నిర్దేశిస్తారు. ఇప్పుడు మినహాయింపును కూడా దాటి జనాలకు దడపుట్టిస్తున్నది. జనం తమకు తామే లేదా ఏ పార్టీ, ప్రజా సంఘం కానీ పెద్దగా ఆందోళనలు చేయకుండానే నరేంద్ర మోడీ సర్కార్ రెండు సార్లుగా పెట్రోలు, డీజిలు ధరల మీద పన్నులను తగ్గించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నటిగా కాకుండా నిజ జీవితంలో గాస్ బండలు పట్టుకొని ధరల పెరుగుదల మీద గత పాలకుల మీద తెగ ఆందోళన చేశారు. ఇప్పుడు అధికారంలో తమ పార్టీ ఉంది గనుక ఆమె అంతర్గతంగా పోరాటం జరిపి ఉండవచ్చు. లేదా ఆ పన్నులు ధరల పెరుగుదలకు దారి తీసి శ్రీలంక మాదిరి జనం ఆందోళనకు దిగుతారనే భయమే కావచ్చు. లేకపోతే అంతకు ముందు పన్నులు తగ్గించేది లేదని భీష్మించుకున్న వారు, రకరకాల వాదనలు, అవాస్తవాలు చెప్పిన వారు ఆకస్మికంగా ఎందుకు మారు మనసు పుచ్చుకున్నట్లు?

ఇప్పుడు పెరిగిన ద్రవ్యోల్బణం ప్రపంచ మంతటా ఉన్నదే తప్ప మా లోపం ఏమీ లేదు అని సరికొత్తగా సమర్ధించుకుంటున్నారు. ఎనిమిదేండ్ల క్రితం ఏం చెప్పారో వారు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మన కాషాయ దళాలు, వాటికి వంతలుగా ఉన్న మీడియా ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరుగుతోందని చెబుతాయి. ఇది జనాన్ని పూర్తిగా తప్పుదారి పట్టించటం తప్ప తర్కానికి నిలిచేది కాదు. దీనికి కారణాలేమిటి? ఒక్కొక్క దేశంలో ఒక్కో కారణం తప్ప అన్ని దేశాలకూ ఒకే కారణం ఉండదు. బిజెపి వారు చెబుతున్నట్లు అంతటా ఒకటే అంటే శ్రీలంకలో మాదిరి మన దగ్గర కూడా పెరగాలి కదా! గతేడాది జులైతో పోలిస్తే లంకలో 2022 జులై ద్రవ్యోల్బణం రేటు 60.8 శాతం ఉంది.

వెనెజులాలో కొన్ని సంవత్సరాలుగా తలెత్తిన ద్రవ్యోల్బణం కొన్ని వేల శాతం పెరిగి జూలై నెలలో 7.5 శాతానికి తగ్గినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కనుక అన్ని చోట్లా ఉంది కనుక మనదగ్గరా ఉంది అన్నది తప్పుడు వాదన. చైనా గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు? లాక్‌డౌన్ల వలన దాని ఆర్ధిక రంగం దెబ్బతిన్నదని, పురోగతిలో మన దేశం కంటే వెనుకబడినట్లు, అక్కడి పరిశ్రమలు వెలుపలికి తరలిపోతున్నట్లు ఇంకా ఇలాంటి కబుర్లు చైనా గురించి చాలా చెబుతున్నారుగాని అక్కడి ధరల పెరుగుదల అంశా న్ని మాత్రం చెప్పరు. తప్పనిసరైతే అక్కడ నిరంకుశంగా ధరలను అణిచివేస్తారు, ధరలను జైలుపాలు చేస్తారు, ధరల హక్కులను హరిస్తారు అని చెబుతారేమో! ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లో చైనాలో సగటున నెలవారీ ధరల పెరుగుదల 1.7 శాతం, ఏడాదిలో మూడు శాతానికి పెరగవచ్చని అంచ నా.

ఒక్క ఈ సంవత్సరమే కాదు, గత పది సంవత్సరాల్లో ఒక్క ఏడాది తప్ప రెండు శాతానికి మించి ధరల పెరుగుదల లేదు. విత్త సంబంధమైన ఉద్దీపన పధకాలను పెద్ద ఎత్తున అమలు జరపకపోవటమే ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి కారణం. ఆహార స్వయం సమృద్ధి, వస్తువుల దిగుమతులు లేకపోవటం మరో కారణం.అయినప్పటికీ చైనాలో పరిమితంగా ద్రవ్యోల్బణం ఉండటానికి లేదా పెరగటానికి అది దిగుమతి చేసుకొనే చమురు, కొన్ని పరికరాలు, ఇతర ముడి వస్తువుల ధరలు ప్రపంచ మార్కెట్లో పెరగటమే కారణం. మన దేశ స్థితి గురించి ఎవరి అంచనాలు వారు చెబుతున్నప్పటికీ అందరూ చెబుతున్నది ఒకటే అదేమిటంటే ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు శాతానికి తగ్గే పరిస్థితి లేదు.

దీని గురించి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎందు కు మాట్లాడటం లేదు అన్నది ప్రశ్న. 2004 నుంచి 2013 వరకు పదేండ్లలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం 8.06 శాతం కాగా, 2014 నుంచి 2021 వరకు మోడీ ఏలుబడిలో 4.87 శాతం ఉంది. గత రెండు సంవత్సరాలుగా పెరుగుతోంది, ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువగా పెరిగింది. ఇక్కడ 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గుజరాత్ సిఎం లేదా బిజెపి నేతగా ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలి. నరేంద్ర మోడీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో ఎవరైనా చూడవచ్చు. ‘ఇది ద్రవ్యోల్బణాన్ని ఓడించే తరుణం, ఇది కాంగ్రెస్‌ను ఓడించే సమయం’ అనే శీర్షిక కింద నరేంద్ర మోడీ చెప్పిన మాటలు, సమాచారాన్ని ఉంచారు. ‘వంద రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానని కాంగ్రెస్ చెప్పింది. వారి వాగ్దానాన్ని నిలుపుకోలేదు. ప్రజా విశ్వాసాన్ని వమ్ము చేసిన వారిని నమ్మవద్దు. ప్రధాని వాజ్‌పేయి, మొరార్జీ దేశా యి ప్రభుత్వాలు ధరలను అదుపు చేసినపుడు మనమెందుకు చేయలేము?

2014లో అధికారానికి వచ్చే బిజెపి ప్రభుత్వం ఆ పని చేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. లోపభూయిష్టమైన విధానాలు, సరైన ప్రణాళిక లేకపోవటమే దీనికి కారణం’ అని నరేంద్ర మోడీ చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఆ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం 1998లో అంటే వాజ్‌పేయి అధికారానికి వచ్చిన ఏడాది 13.1 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని ఓడిన 2004 నాటికి 3.76 శాతానికి తగ్గించగా తరువాత వచ్చిన మన్మోహన్ సింగ్ సర్కార్ 10.92 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు. 2004 ఎన్నికలకు ముందు కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం చేరినందున వంద రోజుల్లో దాన్ని ఇంకా తగ్గిస్థానని కాంగ్రెస్ చెప్పిందనటం ఒక పెద్ద అవాస్తవం. దేశం వెలిగిపోతోందంటూ పెద్దఎత్తున ప్రచారం చేసిన బిజెపి 2004 ఎన్నికల్లో దెబ్బతిన్నది.ఇప్పుడు పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణాన్ని ఓడించాల్సిన అవసరం లేదని నరేంద్ర మోడీ భావిస్తున్నారా? ధరల పెరుగుదల నివారణకు 2011లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వినియోగదారుల వ్యవహారాల మీద ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. దానికి గుజరాత్ సింఎగా నరేంద్ర మోడీ అధ్యక్షుడు. ఇతర సభ్యులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, తమిళనాడు ముఖ్యమంత్రులున్నారు. ఆ బృం దం ఆచరణాత్మక చర్యలంటూ 64 అంశాలు, ఇరవై సిఫార్సులను చేసింది.

ఇప్పుడు అలాంటి కమిటీ లేదు, పదేండ్ల నాటి సిఫార్సుల కట్టమీద దుమ్ము దులిపి ఒక్కసారి చదువుకున్నట్లు కూడా లేదు. కావాలనే వాటిని కూడా విస్మరించారా? లేక ఆ ఫైలు కనిపించలేదా? పోనీ ఒకటవ తరగతి చదువున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేండ్ల పసిపిల్ల కీర్తి దూబే తన పెన్సిల్, ఎరైజర్ వాటిని పారవేసుకుంటే తన తల్లి కోప్పడటం, మాగీ ధరల పెరుగుదల గురించి రాసిన లేఖ గురించి తెలిసిందే. దాని మీద ప్రధాని ఇంత వరకు స్పందించిన దాఖలా నాకు గూగుల్ వెతుకులాటలో కనిపించలేదు. ఎవరికైనా కనిపిస్తే సరి చేసుకుంటాను. ధరల గురించి ప్రధాని స్పందించలేదంటే రెండు కారణాలుండవచ్చు. ఒకటి చమురు ధరలు ఎంత పెరిగినా, పన్నులు ఎంత పెంచినా భరించిన జనం ఇతర వస్తువుల ధరలకు కూడా మెల్లగా అలవాటు పడతారు లెమ్మని కావచ్చు.

తానే నోరు విప్పితే ధరల పెరుగుదలను అంగీకరించినట్లు అవుతుంది, ఒకసారి అంగీకరించిన తరువాత తగ్గించేందుకు తీసుకున్న చర్య లేమిటనే చర్చ జనంలో ప్రారంభం అవుతుంది. ప్రజల ఆందోళనల కన్నా వారిలో ఇలాంటి ఆలోచనలు ప్రమాదకరమని భావిం చి మౌనంగా ఉంటున్నారని అనుకోవాలి. వరల్డ్ డాటా డాట్ ఇన్‌ఫో సమాచారం ప్రకారం 1960 నుంచి 2021 వరకు ద్రవ్యోల్బణ సగటు 7.5 శాతం కాగా కనిష్టం మైనస్ 7.6, గరిష్ఠం 28.6 శాతంగా నమోదైంది. 1960లో వంద రూపాయలకు వచ్చే సరకుల కొనుగోలుకు 2021 చివరిలో రూ. 7,804. 85 చెల్లించాల్సి వచ్చింది. కనుక నరేంద్ర మోడీ అచ్చేదిన్ ఏలుబడిలో 2014లో రూ. 100 విలువ గల వస్తువులు ఇప్పుడు రూ. 146.66 కు గానీ రావటం లేదు. ద్రవ్యోల్బణం అంటే జనాల జేబులకు చిల్లు లేదా జేబులు కొట్టేసినట్లే !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News