Friday, November 22, 2024

బరితెగించిన బతుకు ఖర్చు!

- Advertisement -
- Advertisement -

Inflation in the country, rising prices: Moody's Analytics

 

దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల హద్దులు మీరిపోయి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్టు ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ మూడీస్ ఎనలిటిక్స్ మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయదు. చేతి గడియారాన్ని అద్దంలో చూసుకోవలసిన పని లేదు. ఏడాదికి పైగా కరోనా వ్యాప్తి, మాసాల తరబడి సాగిన సంపూర్ణ లాక్‌డౌన్ నిరుద్యోగాన్ని పెంచి ప్రజల కొనుగోలు శక్తిని హరించి వేశాయి. ఈ నేపథ్యంలో డిమాండ్ తగ్గి, సరకుల ధరలు దిగిరావలసి ఉంది. కాని అందుకు విరుద్ధంగా అవి అనూహ్య స్థాయిలో పైకి ఎగబాకడానికి కేంద్ర పాలకుల విధానాలే కారణమని చెప్పుకోవలసి ఉంది. పెట్రోల్, డీజెల్ ధరలు ఎన్నడూ ఎరుగనంతగా ఆకాశానికి ఎగబాకాయి. లీటరు దాదాపు రూ. 100కు చేరుకున్నాయి. వీటి ప్రభావం ప్రజా రవాణా మీద అసాధారణంగా పడింది. పర్యవసానంగా ధరలు మిన్నంటాయి. ఏడాది క్రితం కరోనాకు ముందు టోకు ధర లీటరు రూ. 98 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు రూ. 155కి చేరుకుంది. వేరు సెనగ నూనె ధర అప్పుడు రూ. 95 ఉండగా, ఇప్పుడు రూ. 150కి పెరిగింది. అలాగే పామాయిల్ ధర రూ. 75 నుంచి రూ. 115 చేరుకుంది.

దేశంలో ఏటా 24 నుంచి 26 మిలియన్ టన్నుల వంట నూనెలు వినియోగమవుతుంటాయి. ఇందులో 60 శాతం వాటా పామాయిల్‌దే. ఎక్కువగా హోటళ్లలో పామాయిల్‌ను వాడుతుంటారు. కొవిడ్ కాలంలో హోటల్ పరిశ్రమ స్తంభించిపోడం తదితర కారణాల వల్ల పామాయిల్‌కు బదులుగా సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం పెరిగిందంటున్నారు. మొత్తం మీద దేశంలో 5 మిలియన్ టన్నుల వంట నూనెల కొరత ఉంది. వీటిని మలేసియా, ఇండోనేసియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆహారంలో అత్యంత ప్రధాన సరకు అయిన వంట నూనెలను ప్రజలకు అందుబాటు ధరలలో ఉంచలేకపోడాన్ని ఏమనాలి? ఇటువంటి పాలక వైఫల్యాలెన్నింటివల్లనో టోకు, చిల్లర మార్కెట్లు మండిపోతూ అసలే ఉద్యోగాలు, ఉపాధులకు దూరమైన సాధారణ జనాన్ని కాల్చుకు తింటున్నాయి. ప్రజా సామాన్యం జీవన వ్యయం ఇంతగా చెట్టెక్కి కూర్చున్నా ఈ అంశం ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్న నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన చర్చనీయాంశం కాలేకపోడం ఆశ్చర్యకరమే కాదు, భయానకం కూడా.

అసాధారణ స్థాయిలో రగులుతున్న ధరల మంటలకు ప్రజలు అలవాటుపడిపోయి, వారి చర్మం మొద్దుబారిపోయిందా? జన సామాన్యం జీవన ప్రమాణాల దిగజారుడును ఎత్తి చూపించి పాలకులకు వెరపు పుట్టించే స్థాయి ప్రజా సమీకరణోద్యమాలు పూర్తిగా నీరుగారిపోయాయా? వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలేయడానికి ఉద్దేశించిన కొత్త సాగు చట్టాలపై రైతులు నాలుగు మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రాజీలేని ఉద్యమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి ప్రజా చైతన్య జ్వాలలపై చన్నీళ్లు చల్లిందా? ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక ప్రగతి విశ్వమంతటా విస్తరించుకున్నందు వల్ల కలుగుతున్న తాత్కాలిక ఉద్యోగావకాశాలవల్ల గాని అయాచిత నగదు ఈ ధరల విజృంభణ చెప్పుకోదగిన సవాలు కాదని ఆయా వర్గాలు భావిస్తున్నాయా? మొత్తానికైతే దేశంలో ధరల పెరుగుదల అసాధారణ శిఖరాలను అందుకుంటున్నది. దానిని ఎందరు తట్టుకోగలుగుతున్నారో, భరించలేక మౌన రోదనతో మరెందరు కొన ఊపిరి జీవితాలు గడుపుతున్నారో చెప్పలేని అయోమయ దుస్థితి ఆవరించిందనడం అసత్యం కాబోదు.

గతంలో ధరలు ఏ మాత్రం పెరిగినా కేంద్ర పాలకులు సమాధానం చెప్పుకోలేని ఇరకాట స్థితిలో పడిపోయేవారు. ఇప్పుడది కనిపించకపోడం గమనార్హం. పాలకులు వాటి ప్రస్తావన లేకుండా ఆర్థిక సంస్కరణల బండిని అతి వేగంగా ముందుకు నడిపిస్తున్నారు. దేశంలో జన జీవన వ్యయ భారమనేది ముందు ముందు ఒక సమస్యే కాబోదనే సూచనలు కనిపిస్తున్నా యి. గడిచిన ఎనిమిది మాసాల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 4 శాతానికి మించకుండా చూడాలని రిజర్వు బ్యాంకు గీచిన గీటు చెరిగిపోయిందని మూడీ ఎనలిటిక్స్ హెచ్చరించింది. ఆహారం, ఇంధనం, కరెంటు వ్యయం మినహా భారత దేశ ప్రధాన వినియోగ ధరల సూచీ గత జనవరిలో 5.3 శాతం ఉండగా, ఫిబ్రవరిలో 5.6 శాతానికి పెరిగిందని లెక్క కట్టింది. అమిత ఆహార, ఇంధన ధరలు గత ఏడాదిలో వినియోగ ధరల సూచీని అనేక సార్లు 6 శాతం దాటించాయని చెప్పింది. 2020 ఏప్రిల్ నుంచి వంట నూనెల ధరలు 60 శాతం పెరిగాయి. ఈ అధిక ధరల జ్వాలలను బొత్తిగానైనా పట్టించుకోకుండా దేశంలో మహా పరివర్తన తీసుకు వస్తామంటూ కేంద్ర పాలకులు చేస్తున్న ప్రసంగాలను వినేవారికి ఎంతటి జుగుప్స కలుగుతుందో చెప్పనక్కర లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News