Tuesday, November 5, 2024

ఇన్‌ఫ్లుయెంజా కేసుల కలవరం

- Advertisement -
- Advertisement -

దేశంలో ఒకపక్క హెచ్ 3 ఎన్3 (h3n3) ఇన్‌ఫ్లుయెంజా, మరోవైపు కొవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇతర ఇన్‌ఫ్లుయెంజా కేసులతో పోల్చుకుంటే హెచ్3ఎన్3 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాలు అంతగా లేకున్నా అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఇన్‌ఫ్లుయెంజా సోకిన వారికి మూడు, నాలుగు రోజుల వరకు జ్వరం ఉంటోంది. జ్వరం తగ్గినా దగ్గు కొనసాగుతోంది. గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి.

కొందరికి శ్వాసతీసుకోవడంలోనూ ఇబ్బంది ఎదురుకావచ్చని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (icmr) వెల్లడించింది. దీని వ్యాప్తి గురించి తెలుసుకుంటే ,.. ఇన్‌ఫ్లుయెంజా సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. తుంపర్లు ఎవరికైనా తాకి నప్పుడు వారు తమ ముక్కు, నోటిని చేతితో ముట్టుకుంటే వారికి కూడా ఈ ఇన్‌ఫ్లుయెంజా సోకే ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అందుకని చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.తరచుగా సబ్బు, నీటితో కడుక్కుంటూ శుభ్రం చేసుకోవాలి.

జనం రద్దీగా ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించడం ఉత్తమం. దానివల్ల మీరు తుమ్మినా, దగ్గినా మీ నుంచి తుంపరలు ఎదుటివారికి తాకవు. అలాగే వేరే వారి నుంచి కూడా తాకడానికి వీలుండదు. ద్రవ పదార్ధాలు తరచుగా తీసుకుంటుండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదు. ఎవరికైనా షేక్‌హ్యాండ్ ఇవ్వరాదు. అస్వస్థత అనిపించినప్పుడు స్వంత వైద్యం పనికిరాదు. వైద్య నిపుణులను సంప్రదించాలి. ఏటా ఈ సీజన్‌లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు వ్యాప్తి చెందడం సహజమే. అలాంటి వాటిలో ఒక రకమే హెచ్3 ఎన్3 వైరస్ అని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా వివరించారు.

అయితే ఈ వైరస్ మార్పులు చెందుతుండటం గమనించవలసిన విషయం. అందుకనే తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సోకిన పిల్లలకైనా, పెద్దలకైనా, ఒసెల్టామివిర్, జానామివిర్, పెరామివిర్, టాలోక్సావిర్‌లతో చికిత్స చేయవచ్చని ఢిల్లీలోని ప్రైమస్ ఆస్పత్రి , పల్మనరీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్‌కె ఛట్రా తెలియజేశారు. కచ్చితంగా వైద్యులు సూచించిన మోతాదు ప్రకారమే యాంటీ వైరల్ డ్రగ్స్ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆహారంలో పసుపు చేర్చుకోవాలని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్‌కు యాంటీ ఇన్‌ఫ్లెమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్,యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి.

అలాగే విటమిన్లు, మినరల్స్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, విటమిన్ బి 6 , కాపర్, పొటాసియం, వంటి పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం, తగ్గించడానికి ఇది గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఈ ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడేవారు పసుపు టీ తాగితే , ఇన్‌ఫెక్షన్ త్వరగా నయం అవుతుంది. దగ్గు,జలుబు , గొంతునొప్పి వంటి సమస్యలతో ఉన్నప్పుడు పసుపు పాలు తీసుకోవడం కూడా మంచి చేస్తుంది. రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగితే ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే ఇమ్యునిటీ పెరుగుతుంది. పళ్ల రసాలు, కెఫిన్ లేని టీ, సూప్ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకుంటుండాలి. సోడా, కాఫీ, ఆల్కహాలుకు దూరంగా ఉండాలి. దాహం వేయక పోయినా నీళ్లు తాగుతూ ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News