న్యూఢిల్లీ: వేసవికాలంలో అడుగు పెడుతున్న సమయంలో గత కొంతకాలంగా కొవిడ్ తరహా లక్షణాలున్న ఇన్‌ఫ్లుయెంజా హెచ్3ఎన్2 వైరస్ రకం కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. ఈ ఫ్లూ తుంపర్ల రూపంలో కొవిడ్ మాదిరిగా వ్యాపిస్తుందని, ప్రతి ఏడాది ఈ సమయంలో వైరస్‌లో ఉత్పరివర్తనలు చోటు చేసుకుంటాయని ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, ఇతర అనారోగ్యాలతో బాధపడేవారు మరింత జాగ్రత్త వహించాలన్నారు.
పెరుగుతున్న ఫ్లూ కేసులు.. ఈ పనులు చేయొద్దు
హెచ్1ఎన్1 వైరస్ వల్ల గతంలో ఒక మహమ్మారిని చవి చూశాం. ఇప్పుడు దానికి సంబంధించిన సాధారణ వేరియంటే హెచ్3 ఎన్2 . దానిలో స్వల్పస్థాయిలో ఉత్పరివర్తనలు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు సులభంగా దీని ప్రభావానికి గురవుతున్నారని వెల్లడించారు. అయితే ఆస్పత్రిలో చేరికలు భారీస్థాయిలో లేకపోవడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసులు పెరగడానికి గల రెండు కారణాలు వెల్లడించారు. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పులు, అలాగే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటి నుంచి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించక పోవడం ఇందుకు కారణమన్నారు.
ఫ్లూ లక్షణాలివే…
గత రెండు మూడు నెలలుగా ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఈ హెచ్3 ఎన్2 రకం ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీని ప్రధాన లక్షణాలు.. ఎడతెరపి లేని దగ్గు, జ్వరం. దీంతోపాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు.