Wednesday, January 22, 2025

సిలికాన్ ఇండియా అవసరం

- Advertisement -
- Advertisement -

సెమీకండక్టర్, కంప్యూటర్, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్ చిప్స్ రూపంలో ఇన్ఫర్‌మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా మానవాళి ముందు మరో అద్భుత ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. ఆధునిక డిజిటల్ ప్రపంచానికి గుండెకాయగా సెమీకండక్టర్ చిప్స్ పేరు పొందాయి. నేటి ఆధునిక శాస్త్రసాంకేతిక యుగంలో సెమీకండక్టర్ (అర్థవాహకం) చిప్స్ రూపంలో సమాచారాన్ని నిల్వ ఉంచడం (మెమొరీ చిప్స్), ఆప్తులతో ప్రేమల్ని పంచుకోవడం (కమ్యూనికేషన్ చిప్స్), వేకువనే నిద్ర లేపడం (లాజిక్ చిప్స్), నిద్రించినపుడు అవయవాల పర్యవేక్షణ (సెన్సార్ చిప్స్) చేయడం లాంటి పలు అంశాలతో సెమీకండక్టర్ చిప్స్ బహు విధాలుగా మన జీవనశైలిలో తెలియకుండానే భాగమయ్యాయి.

ప్రపంచంలో ఏ భాగంలో, ఏ సమయంలో పయనించినా మనకు సుస్పష్టంగా దారిని చూపగల గూగుల్ మ్యాప్‌లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. చిప్స్‌లో అంతర్భాగంగా ఎలక్ట్రానిక్ సర్కూట్ పొరలు సిలికాన్ ఉపరితలంపై ఏర్పడి ఉంటాయి. సమాచార నిల్వ, సమాచార ప్రసారం, వేగంగా డాటాను విశ్లేషించడం లాంటి ముఖ్య విధులను సెమీకండక్టర్ చిప్స్ నిర్వహిస్తూ నేటి డిజిటల్ విప్లవానికి కారణమవుతూ, ఐసిటి వ్యవస్థలకు పునాదులుగా మారుతున్నాయి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో అర్థవాహక (సెమీకండక్టర్) చిప్స్ హీరోలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి.ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్స్ లాజిక్, మెమొరీ చిప్స్ అనబడే రెండు రకాలు ఉంటాయి. ప్రతి ఎలక్ట్రానిక్ ఉపకరణంలో ఈ రెండు రకాల చిప్స్ అవసరం అవుతాయి. ప్రాసెసర్స్, గ్రాఫిక్ కార్డులు లాంటివి లాజిక్ చిప్స్‌కు ఉదాహరణలు కాగా ర్యామ్, యస్‌డి కార్డులు మెమొరీ చిప్స్‌కు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

సెమీకండక్టర్ చిప్స్ తయారీ బహు దశల్లో అత్యంత శుద్ధతతో కూడిన సంక్లిష్ట ప్రక్రియలు, అతి ఖచ్చితత్వ దశలు ఉంటూనే అధిక పెట్టుబడులతో పాటు అధిక సమయం వెచ్చించాల్సిన అవసరం అవుతాయి. 1971లో 4004 ట్రాన్‌సిస్టర్ చిప్స్ తయారు చేసిన ప్రపంచం నేడు బిలియన్ల ట్రాన్‌సిస్టర్లను తయారు చేసే స్థితికి చేరినా డిమాండ్‌కు తగిన ఉత్పత్తులను చేయలేకపోవడం విచారకరమే. ఆధునిక సెమీకండక్టర్ చిప్స్ స్మార్ట్‌గా, సూక్ష్మంగా, తేలికగా, శీతలంగా ఉంటున్నాయి. నేటి కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్ టెక్నాలజీల్లో సెమీకండక్టర్ చిప్స్ పాత్ర అమూల్యం. కొవిడ్-19 ప్రళయ కాలంలో మానవాళిని ఏకం చేసిన సెమీకండక్టర్ చిప్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్, డిజిటల్ టివి లాంటి అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు కృతజ్ఞతలు తెలుపవలసిందే. ఆన్‌లైన్ విద్యాబోధనలు, వర్క్‌ఫ్రమ్ హోమ్, ఇ వాణిజ్యాలు మన జీవనశైలిలో అనివార్యంగా భాగం కావడం చూశాం.

ప్రపంచ గమనానికి డిస్పే డ్రైవర్స్, కమ్యూనికేషన్ చిప్స్, వీడియో, ఆడియో ప్రాసెసింగ్ యూనిట్స్ రూపంలో సెమీకండక్టర్లు దోహదపడుతున్నాయి. కరోనా అలల కల్లోలంలో కొవిడ్ టీకాల అభివృద్ధి, ఆర్థిక, సామాజిక కార్యాల గమనాలు ప్రపంచ వ్యాప్తంగా పునఃప్రారంభం కావడానికి సెమీకండక్టర్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. కంప్యూటర్ చిప్స్ కొరతతో కార్లు, ప్లే స్టేషన్లు, బ్రాడ్‌బాండ్ రూటర్లు లాంటి అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తయారు చేసే పరిశ్రమలు తమ ఉత్పత్తులను తగ్గించుకున్నాయి. అత్యంత చిన్నదైనప్పటికీ చిప్స్ లేకుండా డిజిటల్ ప్రపంచం క్షణం కూడా గడవదు. ఆసియాకు చెందిన తైవాన్, చైనా, దక్షిణ కొరియాల్లోని కంపెనీలు సిలుకాన్ చిప్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం జరుగుతోంది. కొవిడ్ మహమ్మారి ప్రబలడంతో పాటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా, -చైనా సంబంధాలు దెబ్బతినడం తో చిప్స్ కొరత పెరిగింది. కరోనా విజృంభణతో వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ల్యాప్‌టాప్‌లు, వెబ్‌కామ్, మానిటర్స్,

క్రోమ్‌బుక్స్, టివిలు, ఎయిర్ ఫ్యూరిఫయర్లు, స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలు లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలు పెరగడంతో చిప్స్ కొరత మరింత పెరిగింది. సెమీకండక్టర్ చిప్స్‌తో కూడిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు టెలికమ్, రక్షణ, అంతరిక్ష, అంతర్జాల పర్యవేక్షణ, పవర్, ఆటోమొబైల్ లాంటి అన్ని రంగాల్లో వినియోగించబడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిప్స్ కొరత ఇండియాలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. 2020లో ఇండియాలో సెమీకండక్టర్ల వినియోగం 20 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఈ చిప్స్ కొరతను తీర్చడానికి భారత ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తులను ‘సిలికాన్ ఇండియా’ ప్రోగ్రామ్స్ తీసుకొని ప్రోత్సహిస్తున్నది. నేడు రాజస్థాన్, ఆంధ్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో సిలికాన్ ముడి సరుకులు అందుబాటులో ఉన్నాయి.

సెమీకండక్టర్ చిప్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడానికి పరిశ్రమలకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తున్నది. ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి సిలికాన్ చిప్స్ తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం కనీస అవసరం అయింది. 2021లో భారత ప్రభుత్వం రూ. 76,000- కోట్ల ఆర్థిక సహాయం చేస్తూ కంప్యూటర్ చిప్స్ తయారు చేయగల విదేశీ కంపెనీలను భారత్‌కు ఆహ్వానించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News