ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు నోడల్ అధికారికి పంపించాలి : జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలు, లెక్కకు మించిన నగదు అకౌంట్ల సమాచారం ఎన్నికల నోడల్ ఆఫీసర్ అకౌంటింగ్‌కు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం పన్వర్ హాల్ లో జిల్లాలోని అన్ని బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకులలో జరిగే డిజిటల్ లావాదేవీలలో అనుమానిత, లెక్కకు మించిన నగదు అకౌంట్ లపై నిఘా ఉంచి వాటి సమాచారం ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు జిల్లా ఎన్నికల అధికారికి పంపించాలని తెలిపారు. యు.పి.ఐ (గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే) ల ద్వారా ఎక్కువ అకౌంట్లకు నగదు బదిలీ అయ్యే అకౌంట్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిచాలన్నారు.
ఏటిఎం లలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు ఆయా బ్యాంకులు తప్పనిసరిగా జిపిఎస్ ను ఏర్పాటు చేసి వాహనాలను పరిశీలించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్‌లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ నగదుకు సంబంధించి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ డిఈఓ అనుదీప్ దురిశెట్టి వివరిస్తూ నగరంలో పట్టుబడుతున్న నగదును పరిశీలించి ఎటువంటి సమస్య లేనప్పుడు వాటిని వేగవంతంగా రిలీజ్ చేస్తున్నామన్నారు.
అభ్యర్థుల తుది జాబితా నవంబర్ 13వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోటీలో పాల్గొనే రాజకీయ పార్టీల అభ్యర్థుల అకౌంట్ నెంబర్లను సంబంధిత బ్యాంకులకు అందించడం ద్వారా వారి లావాదేవీలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అభ్యర్థి, అభ్యర్థి సంబంధికుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని, పొలిటికల్ పార్టీలు ఒక లక్షకు మించిన నగదు లావాదేవీల పై సమాచారం అందించాలని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులు అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్ అయిన అకౌంట్ లు, రాజకీయ పార్టీల అకౌంట్ లపై సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ శరత్ చంద్ర, అడిషనల్ కమిషనర్ ఎలక్షన్ శంకరయ్య, ఐటీ అధికారులు మనీష, ఆర్‌బిఐ మేనేజర్, హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.