బెంగళూరు: దేశీయ ఐటీ జెయింట్ ‘ఇన్ఫోసిస్’ కీలక నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనంలో భారీ కోత విధించనున్నది. 2021-22తో పోలిస్తే 29.3 శాతం కోత విధించనున్నది. 2021-22లో 88 శాతం పెరిగిన సలీల్ పరేఖ్ వేతనం రూ.79.8 కోట్లు కాగా, 2022-23లో రూ.56.4 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ పనితీరు బలహీనంగా ఉండటంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ అంచనాలు మోస్తారుగా ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో సంస్థ యాజమాన్యం ఆయన వేతన పరిహారం తగ్గించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు సలీల్ పరేఖ్‌కు చెల్లిస్తున్న పరిహారం రూ.56.4 కోట్లలో ఆయన రెన్యూమరేషన్ రూ. 30.6 కోట్లు కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఇన్ఫోసిస్ నుంచి వెళ్లిపోతున్న ప్రెసిడెంట్ మోహిత్ జోషి పరిహారం 2021-22తో పోలిస్తే 64.6 శాతం గ్రోత్తో రూ. 34.8 కోట్ల నుంచి రూ.57.3 కోట్లకు పెరిగింది. ఏడాది ప్రారంభంలో మోహిత్ జోషి.. ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేశారు. గత మార్చి 11 నుంచి ఈనెల తొమ్మి దో తేదీ వరకు ఆయన సెలవులో ఉన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన ఇన్ఫోసిస్‌తో మోహిత్ జోషి అనుబంధం తెగిపోనున్నది. ఇక ఉద్యోగుల సగటు మెడియన్ రెన్యూమరేషన్ 2021-22తో పోలిస్తే 2022-23లో 9.9 శాతం పెరిగి రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెరిగింది. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న 124 మంది ఎగ్జిక్యూటివ్ల వేతనం రూ.కోటిపైనే.