Tuesday, November 5, 2024

ఇన్ఫోసిస్ లాభం రూ.5,195 కోట్లు

- Advertisement -
- Advertisement -

Infosys Q1 profit Rs 5,195 crore

గతేడాదితో పోలిస్తే 23 శాతం వృద్ధి
ఈ ఏడాదిలో 35 వేల నియామకాలు చేపడతాం: సిఇఒ

బెంగళూరు : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో దేశీయ సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ అద్భుతంగా రాణించింది. బుధవారం వెల్లడించిన ఫలితాల్లో కంపెనీ నికర లాభం రూ.5,195 కోట్లతో 22.7 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.4,233 కోట్లుగా ఉంది. త్రైమాసిక ప్రతిపాదన చూస్తే కంపెనీ లాభం రూ.5,076 కోట్లు (క్యూ4)తో పోలిస్తే 2.3 శాతం పెరిగింది. ఇన్ఫోసిస్ ఆదాయం రూ.27,896 కోట్లతో 17.87 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ.23,665 కోట్లుగా ఉంది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 23.7 శాతం వద్ద ఉండగా, త్రైమాసిక ప్రాతిపదికన డాలర్లలో ఇది 4.7 శాతం పెరిగింది. డాలర్ ఆదాయాలు 3613 మిలియన్ డాలర్ల నుండి 3781 మిలియన్ డాలర్లకు పెరిగాయి.

జూన్ త్రైమాసికంలో కంపెనీ 113 మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. గత ఏడాది ఈ సంఖ్య 110గా ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కాలంలో అట్రిషన్ రేటు గత సంవత్సరం 15.6 శాతం నుండి 13.9 శాతానికి తగ్గింది. అంటే సంస్థను వదిలి వెళ్ళే ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాల్లో దాదాపు 35 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఉత్తర అమెరికాలో కంపెనీ వ్యాపారం వృద్ధి 61.7 శాతం. ఐరోపా మార్కెట్ 24 శాతం పెరిగింది. మార్కెట్లో ఇన్ఫోసిస్ షేర్లు 2.10 శాతం పెరిగి రూ .1577.40 వద్ద ముగిశాయి.

ఉద్యోగుల అంకితభావం నడిపించింది: ఇన్ఫోసిస్ సిఇఒ

ఫలితాలపై ఇన్ఫోసిస్ సిఇఒ (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్), మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ పరేఖ్ స్పందిస్తూ, సంస్థ ఉద్యోగుల అంకితభావం, క్లయింట్ల నమ్మకమే నడిపించాయని, దశాబ్ద కాలంలో క్యూ1లో 16.9 శాతంతో అత్యంత వేగంగా వృద్ధిని సాధించామని అన్నారు. త్రైమాసిక ప్రతిపాదికన కరెన్సీలో 4.8 శాతం వృద్ధి ఉందని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News