Monday, December 23, 2024

యుద్ద ప్రాతిపదికన ఇంటర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు
నిధులు మంజూరు చేసినా పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి
ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని కమిషనర్ నవీన్ మిట్టల్‌కు సూచన

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాలల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రికి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాల కోసం, ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4 .43 కోట్లు మంజూరు చేశామని, వెంటనే ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు.
పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై మంత్రి ఆగ్రహం
విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయడానికి కేవలం ఆర్‌టిసిపైనే ఆధారపడకుండా ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్న మన రాష్ట్రంలో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే విషయంలో ఆరోపణలు వస్తున్నాయని, ఇది నిజం కాదని పేర్కొన్నారు. 119 జ్యోతిరావు పూలె పాఠశాలలను, 38 కెజిబివిలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్‌గ్రేడ్ చేశారని, వీటిలో కొంత మంది విద్యార్థులు చేరారని మంత్రి పేర్కొన్నారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా ఈ మూడు జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News