Tuesday, September 17, 2024

అరుణ గ్రహంపై ఎగిరిన రెక్కలు

- Advertisement -
- Advertisement -

Ingenuity helicopter fligh over the Mars

భౌతికమైన కంటి చూపుకి హద్దులుంటాయి, మనోవీక్షణకు పరిమితులుండవు. దీనితోనే మన పురాణాల్లో ఊర్ధలోకాలు, మహిమలు, క్షణకాలంలో కనిపించి మాయం కావడం వంటివి కల్పించారు. అనుకున్న తోడనే మహా నిర్మాణాలు ప్రత్యక్షం కావడం, విధ్వంసమైపోడం వంటి అద్భుత సన్నివేశాలను రక్తికట్టించారు. మేధస్సు అనే కంటితో చూడడాన్ని వాస్తవ పరిశోధన సాధనంగా చేసుకొని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు గ్రహాంతర రహస్యాలను ఛేదిస్తున్నారు. మానవాళి మనుగడకు, పురోగతికి ఉపయోగపడే ప్రత్యామ్నాయ భూమి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. భూగ్రహానికి అతి దగ్గరిలో గల అరుణ (అంగారక) గ్రహమ్మీదికి చూపు సారించి చాలా కాలమైంది. అక్కడ ప్రాణులు పుట్టి వర్ధిల్లడానికి అనువైన వాతావరణమున్నదని భావిస్తున్నారు. ఆ గ్రహమ్మీద నీరు లభించే అవకాశాల కోసం పరిశోధనలు సాగిస్తున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సంస్థ కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా అంతరిక్షం నుంచి భూ రహస్యాలను తెలుసుకోడంతో పాటు ఇతర గ్రహాల గుట్టుమట్టులు గ్రహించడంలోనూ ప్రగతి సాధిస్తున్నది.

అరుణ గ్రహమ్మీదికి నాసా పంపిన ఇన్‌జెన్యూటీ అనే అతి సూక్ష్మమైన (1.8 కిలోగ్రాములు, 19 అంగుళాల) హెలికాప్టర్ ఈ నెల 19 సోమవారం నాడు విజయవంతంగా పైకెగిరిన ఘట్టం అత్యంత చరిత్రాత్మకమైనది. 1903లో అమెరికాలోని నార్త్ కరోలినాలో రైట్ బ్రదర్స్ (వొర్రిల్లే, విల్‌గుర్) గాలి మోటారు (విమానం) ను కనుగొన్న సందర్భంతో దీనిని నాసా శాస్త్రజ్ఞులు పోల్చారు. అన్యగ్రహంలో విజయవంతమైన తొలి విమాన ప్రయోగంగా దీనిని వారు భావించడాన్ని ఎంత మాత్రం ఆక్షేపించలేము. భూమికి 17 కోట్ల (170 మిలియన్లు) మైళ్ల (287 మిలియన్ కిలోమీటర్లు) దూరంలోని అంగారక గ్రహమ్మీద ముందుగానే కీ ఇచ్చి (ప్రోగ్రాం చేసిన) పంపించిన మినీ హెలికాప్టర్ అనుకున్నట్టు ఎగరడం మాటలు కాదు. 1903 డిసెంబర్ 7న రైట్ బ్రదర్స్ ప్రయోగాత్మకంగా వదిలిపెట్టిన తొలి విమానం 12 సెకన్ల పాటు ఎగరగా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ అంగారక గ్రహంపై 10 అడుగుల ఎత్తున 30 సెకన్ల పాటు గాలిలో విహరించింది.

ఈ దృశ్యాన్ని పెర్సెవరెన్స్ రోవర్ రంగుల వీడియో చిత్రం తీసి పంపించింది. 2020 జూలై 30వ తేదీన పెర్సెవరెన్స్ రోవర్‌ను అంగారక రాళ్లు, మన్ను నమూనాలను తవ్వడం కోసం నాసా అక్కడికి పంపింది. దానితో పాటే ఇన్‌జెన్యూటీని కూడా చేర్చారు. పెర్సెవరెన్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అరుణ గ్రహంపై దిగింది. అనువైన స్థలం చూసుకొని సోమవారం నాడు అది ఇన్‌జెన్యూటీని విడుదల చేయడం కోరుకున్న విధంగా ఎగరడం జరిగిపోయాయి. దీనిని ఆధారం చేసుకొని ముందు ముందు అరుణ గ్రహమ్మీదికి రాకపోకలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానవులు అక్కడికి వెళ్లి స్థిరపడడానికి అనువైన దిశను పెర్సెవరెన్స్, ఇన్‌జెన్యూటీలు సుగమం చేయడం ప్రారంభించాయని అనుకోడం అతిశయోక్తి కాబోదు. వీటి విజయం గ్రహాంతర అన్వేషణ చరిత్రలో చిరస్థాయిని పొందుతుంది. ఈ బుల్లి హెలికాప్టర్ ఇంత పెద్ద కార్యాన్ని భుజాన వేసుకొని గత జులైలో అంగారక గ్రహమ్మీదికి ప్రయాణమైనప్పుడే ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించిందని నాసా సైన్సు బృందం అధినేత థామస్ జుర్ బుచెన్ అన్నారు. ఈ విజయం మానవాళి అంతటికీ గొప్ప ఆశను కల్పిస్తున్నది అని ఆయన ట్వీట్ చేశారు.

సాహసం చేయకపోతే ఏ కొత్త ద్వారమూ తెరుచుకోదు. క్రీ.పూ. 3500 సంవత్సరంలో చక్రాన్ని కనుగొన్నప్పటి నుంచి మానవాళి జీవన గమనం ఎన్నెన్నో విజయవంతమైన మలుపులు తిరిగి ఈనాటి అత్యాధునిక స్థాయికి చేరుకున్నది. ఆ వరుసలో పెర్సెవరెన్స్, ఇన్‌జెన్యూటీలు విశేష స్థానాన్ని పొందుతాయి. అంగారక గ్రహమ్మీద గతంలో ఎప్పుడైనా జీవరాశి మనుగడ సాగించిందా, అక్కడి వాతావరణ పరిస్థితులేమిటి, మట్టి లక్షణాలు ఎటువంటివి అనే వాటిని కూలంకషంగా పరిశోధించాలని నాసా పథకం వేసుకున్నది. ఈ అన్వేషణ పూర్తిగా ఫలించి మానవులు బతకడానికి తగిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయని తేలితే అరుణ గ్రహ అన్వేషణ విప్లవాత్మకమైన మలుపులు తిరుగుతుంది. అందుకు చాలా కాలం పట్టవచ్చు. కాని అటువంటి మహత్తర పరిణామానికి ఇది గొప్ప నాంది. ఇప్పటికే చంద్ర మండలం మీద మనిషి సాగించిన పరిశోధనలు విశేష ఫలితాలను ఇస్తున్నాయి. భవిష్యత్తులో అరుణ గ్రహతలం కూడా అటువంటి ఘన విజయాల వేదిక కాగలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News