Thursday, January 30, 2025

నాకు షరియా కాదు వారసత్వ చట్టమే వర్తించాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : షరియాకు బదులు భారతీయ వారసత్వ చట్టమే తనకు వర్తించాలని అభ్యర్థిసూ ఒక ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం వైఖరి ఏమిటని సుప్రీం కోర్టు మంగళవారం అడిగింది. ‘కేరళ పూర్వపు ముస్లింలు’ సంస్థ ప్రధాన కార్యదర్శి, అళప్పుళ వాసి సఫియా పిఎం పిటిషన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ (ఎస్‌జి) తుషార్ మెహతా ఈ పిటిషన్ ఒక ఆసక్తిదాయక ప్రశ్నను లేవనెత్తిందని అన్నారు. ‘పిటిషనర్ మహిళ జన్మతః ముస్లిం. తనకు షరియాలో విశ్వాసం లేదని ఆమె చెబుతోంది, అది ఒక తిరోగమన చట్టం అని ఆమె భావిస్తోంది’ అని మెహతాపేర్కొన్నారు. ‘ఇది మత విశ్వాసాల వ్యాప్తంగా వర్తిస్తుంది. మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసి ఉంటుంది’ బెంచ్ సూచించింది.

ఆదేశాలు తీసుకుని, కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు మూడు వారాలు కావాలని మెహతా కోరారు. బెంచ్ నాలుగు వారాలు మంజూరు చేసి, ఈ విషయాన్ని మే 5న మొదలయ్యే వారంలో వింటామని తెలియజేసింది.ఈ పిటిషన్‌పై కేంద్రం, కేరళ ప్రభుత్వ స్పందనలను సర్వోన్నత న్యాయస్థానం నిరుడు ఏప్రిల్ 29న కోరింది. తాను అధికారికంగా ఇస్లాంను వదిలిపెట్టకపోయినప్పటికీ తాను విశ్వాసపరురాలిని కానని, అధికరణం 25 కింద తన మత ప్రాథమిక హక్కు అమలును కోరుకుంటున్నానని తెలిపిన పిటిషనర్ దానిలో ‘విశ్వసించని హక్కు’ను కూడా చేర్చాలని అన్నారు. ముస్లిం పర్సనల్ లా తమకు వర్తించకూడదని ఆకాంక్షిస్తున్న వ్యక్తులను మరణ శాసనంలేని, నిబంధన వారసత్వం విషయాల్లో ‘దేశం సెక్యులర్ చట్టం’ భారతీయ వారసత్వ చట్టం 1925ను వర్తించేలా అనుమతించేలా ఒక డిక్లరేషన్‌ను జారీ చేయాలని కూడా ఆమె కోరారు. షరియా చట్టాల కింద ఆస్తిలో మూడింట ఒక వంతు వాటాకు ముస్లిం మహిళలు అర్హులని న్యాయవాది ప్రశాంత్ పద్మనాభన్ ద్వారా దాఖలైన సఫియా పిటిషన్ స్పష్టం చేసింది.

పిటిషనర్‌కు ముస్లిం పర్సనల్ లా వర్తించదనే డిక్లరేషన్ కోర్టు నుంచి రావలసి ఉంటుందని, లేనిచో ఆమె తండ్రి ఆస్తిలో మూడింట ఒక వంతు ఇవ్వలేకపోవచ్చునని న్యాయవాది సూచించారు. ముస్లింలను మినహాయించినందుకు భారతీయ వారసత్వ చట్టాన్ని, ఇతర నిబంధనలను సవాల్ చేసేందుకు తగు విధంగా పిటిషన్‌ను సవరించేందుకు సఫియాను సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో విపరిణామాలు సంభవించవచ్చునని సూచిస్తూ పిటిషన్ జోక్యం చేసుకోవలసిందిగా బెంచ్‌కు విజ్ఞప్తి చేసింది. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు ముస్లిం మహిళలు అందరి కోసం అని, కాని ప్రస్తుత పిటిషన్ ముస్లింగా జన్మించి మతాన్ని వీడాలని ఆకాంక్షించే వారి కోసమని పిటిషన్ పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News