Sunday, January 19, 2025

మధ్యతరగతిపై ‘వారసత్వ పన్ను’వేయాలనుకుంటున్న కాంగ్రెస్: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మధ్యతరగతిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ‘వారసత్వ పన్ను’ను తేవాలని కాంగ్రెస్ తీవ్రంగా కోరుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఆరోపించారు. ఆమె బెంగళూరులోని బీఈస్ కాలేజ్ లో ఓటేశాక ఈ విషయం చెప్పారు. అయితే వారసత్వ పన్ను తేవాలనుకుంటున్న ఆరోపణ విషయాన్ని కాంగ్రెస్ పదేపదే ఖండించింది. తామెక్కడా ఆ విషయాన్ని తమ మేనిఫెస్టోలో పేర్కొనలేదని కూడా వాదించింది. కానీ నిర్మలా సీతారామన్ వారసత్వ పన్ను వంటిదేదో కాంగ్రెస్ పార్టీ తేవాలనుకుంటోందని, దాని వల్ల గత దశాబ్ద కాలంగా భారత్ సాధించిన ప్రగతి నీరుగారిపోతుందని పేర్కొన్నారు. ‘‘ 1968కి ముందు తప్పనిసరి డిపాజిట్ స్కీమ్ అనేది ఉండేదని నాకు గుర్తు. దాని ప్రకారం ప్రజలు 18 శాతం, 20 శాతం పొదుపు డిపాజిట్ చేయాల్సి ఉంటుండేది. అందులో కొంత తీసేసుకున్నారు. అప్పట్లో దానికి సంబంధించిన న్యాయం కూడా జరుగలేదు.  సంపదను పెంచే వారిని శిక్షించడం అంటే భారత్ ఇంత వరకు సాధించిన ప్రగతిని జీరోకు తీసుకెళ్లడమే. మళ్లీ మనం ఆ కాలానికే వెళ్లనున్నాము. అప్పట్లో కాంగ్రెస్ 90 శాతం పన్ను విధించేది. నాటి పన్ను విధానం గురించి నేటి తరానికి ఏమీ తెలియదు. కాంగ్రెస్ భారత్ ను పాలించిన కాలంలో మన ఆదాయంపై 90 శాతం పన్ను పడింది. అదో సోషలిస్ట మోడల్. కాంగ్రెస్ పార్టీకి ఆ విధానమే బాగుంటుంది…కాంగ్రెస్ తేవాలనుకుంటున్న వారసత్వ పన్ను మధ్య తరగతి ప్రజలను నేరుగా ప్రభావితం చేయగలదు. మధ్య తరగతి ప్రజలు చెమటోడ్చి, నానా కష్టాలు పడి తమకంటూ కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటారు. ఇల్లు కొనుకుంటారు. కొంత ఫిక్స్ డ్ డిపాజిట్ పెట్టుకుంటారు. కానీ ఇదంతా ప్రాపర్టీ ట్యాక్స్ పేరిట బట్టబయలు కాగలదు’’ అని ఆమె వివరించారు. దేశంలో ప్రజలు ప్రధాని మోడీయే కొనసాగాలని కోరుకుంటున్నారని కూడా ఆమె తెలిపారు. సుస్థిర ప్రభుత్వం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను అని ఆమె తెలిపారు.

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా సంపద పున:పంపిణీ గురించి మాట్లాడుతున్నారు. అమెరికాలో ఆయనే ఈ ‘వారసత్వ పన్ను’ భావనను పేర్కొన్నారు. ఆయన దీనిపై చర్చ జరగాలని కూడా కోరుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మరోలా వాదిస్తోందని సీతారామన్ వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News