Friday, November 15, 2024

వర్గీకరణపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

23 పిటిషన్లపై విచారణ చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం
న్యూఢిల్లీ : రిజర్వ్‌డ్ కేటగిరీల్లో ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా, అవి చెల్లుబాటు అవుతాయా అనే న్యాయపరమైన అంశానికి సంబంధించి దాఖలయిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విచారణ జరుపుతోంది. బెంచ్‌లో న్యాయమూర్తులుగా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా ఎం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీశ్ చంద్ర మిశ్రాలు ఉన్నారు.

వర్గీకరణను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ దాఖలయిన మొత్తం 23 పిటిషన్లను ఈ ధర్మాసనం విచారిస్తుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ దాఖలు చేసిన పిటిషన్ కూడా వీటిలో ఉంది.వాల్మీకీలు, మజాబీ సిక్కులకు ఎస్‌సి కోటాలో 50 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ వీటిలో ప్రధానమైనది. మిగతా పిటిషన్లను దీనితో కలిపి ధర్మాసనం విచారిస్తోంది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మొదట జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది.

బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాల వారీగా వర్గీకరించవచ్చని 2020ఆగస్టు 20నఆ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే ఈ బెంచ్ తీసుకున్న నిర్ణయం 2004లో ఇవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల తరగతిలో ఒక తరగతిని చేర్చడడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. ఈ కేసులో రెండు బెంచ్‌ల భిన్నమైన తీర్పులు ఇచ్చిన దృష్టా ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలని ఐదుగురు జడ్జీల ధర్మాసనం అభిప్రాయపడింది.. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యాసంస్థల్లో షెడ్యూల్డ్ కులాలకు అందుబాటులో ఉన్న సీట్లలో 22.5 శాతం , ఎస్‌టిలకు 7.5 శాతం రిజర్వ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇదే కొలబద్ద.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News