చండీగఢ్: హర్యానా కర్నాల్ జిల్లాలో శనివారం పోలీసుల లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడిన ఓ రైతు ఆదివారం మరణించారు. కర్నాల్ టోల్‌ప్లాజా వద్ద రైతులు శనివారం నిరసనకు దిగగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝలిపించిన విషయం తెలిసిందే. లాఠీచార్జీలో గాయపడిన రైతు సుశీల్‌కజాల్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారని బికెయు నేత గురునామ్‌సింగ్‌చాదునీ తెలిపారు. ఒకటిన్నర ఎకరం భూమి ఉన్న కజాల్ 9 నెలలుగా రైతుల ఆందోళనలో పాల్గొంటున్నారని చాదునీ తెలిపారు. కజాల్ త్యాగాన్ని రైతు సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు. పోలీసుల లాఠీచార్జీకి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హర్యానాలోని రైతు సంఘాలు మరోసారి పిలుపునిచ్చాయి. దాంతో, ఆదివారం పలు చోట్ల జాతీయ రహదారులు, టోల్‌ప్లాజాలను రైతులు దిగ్బంధించారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. హర్యానా రైతులపై లాఠీచార్జీకి నిరసనగా పొరుగు రాష్ట్రాల్లోనూ రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.