బిజెపిపై టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ధ్వజం
ఎవరికీ తలొంచేది లేదని వ్యాఖ్య
వీల్‌చైర్‌లోనే ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. నందిగ్రాంలో నామినేషన్ దాఖలు సందర్భంగా గాయపడి ఆస్పత్రిలో చేరిన నాలుగు రోజలు అనంతరం ఆమె ఆదివారం వీల్‌చైర్‌పైనే టిఎంసి రోడ్‌షోలో పాల్గొన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు 2007 మార్చి 14న నందిగ్రాంలో బలవంతపు భూ సేకరణను అడ్డుకున్న గ్రామస్థులపై పోలీసులు కాల్పులు జరపగా 14 మంది మరణించారు. మమత అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రతి ఏటా మార్చి 14ను నందిగ్రాం దివస్‌గా పాటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం మాయో రోడ్‌లోని టిఎంసి కార్యాలయంనుంచి హజారే మోర్ దాకా దాదాపు 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన రోడ్ షోలో మమత వీల్‌చైర్‌లో పాల్గొన్నారు. పలువురు పారీట నేతలు వెంట రాగా మమత వీల్‌చైర్‌ను ఆమె సెక్యూరిటీ సిబ్బంది తోసుకుంటూ ముందుకు సాగారు. నాడు కాల్పుల్లో మృతి చెందిన 14 మందికి మమత నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ‘ నేను గాయపడ్డాను. అనారోగ్యంతో ఉన్నాను. అయినా నా లక్షం మాత్రం మిగిలే ఉంది. నా శరీరం గాయాలతో నిండి ఉంది. అయినా నేను ఈ వీల్‌చైర్ మీదనే బెంగాల్ అంతా తిరుగుతా. నేను బెడ్‌రెస్ట్ తీసుకుంటే బెంగాల్ ప్రజల వద్దకు ఎవరు వెళ్తారు?’ అని ప్రశ్నించారు. తాను ఎవరి ముందూ తల వంచబోనని అంటూ గాయపడిన పులి చాలా ప్రమాదకరమైందని వ్యాఖ్యానించారు. ‘నేనునా జీవితంలో ఎన్నో దాడులను ఎదుర్కొన్నాను, అయినా ఎవరి ముందూ నేను లొంగిపోలేదు. నేను ఎవరి ముందూ తలవంచను. గాయపడిన పులి మరింత ప్రమాదకరంగా మారుతుంది’ అని దీదీ వ్యాఖ్యానించారు. ‘ ఈ రోజు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని వైద్యులు సలహా ఇచ్చారు. అయినా నేను తప్పకుండా ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నా కాలి గాయం కారణంగా ఇప్పటికే మనం కొన్ని రోజులు కోల్పోయాం. నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు.ప్రజలు పడుతున్న బాధతో పోలిస్తే నేను పడుతున్న ఈ బాధ అంత తీవ్రమైనదేమీ కాదు’ అని మమత అన్నారు.
మమతా బెనర్జీ ‘బెంగాల్ బిడ్డ’ అన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ‘భంగాపాయే ఖేలా హోబే’(విరిగిన కాలితోనే అడుతాము) అంటూ మమత కాలి గాయాన్ని ఉద్దేశిస్తూ కూడా వారు నినాదాలు చేశారు. కాగా దాడి చేయడం వల్ల మమత కాలికి గాయమవలేదని, సిబ్బంది వైఫల్యం వల్లనే ఆమె గాయపడ్డారని ఎన్నికల కమిషన్ (ఇసి)నిర్ధారణకు వచ్చింది. కాగా మమత ఆదివారం సాయంత్రం దుర్గాపూర్‌కు వెళ్తారు. అక్కడ ఆమె రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. కాగా, ‘ ఈ పుణ్యభూమిని రక్షించుకోవడం కోసం చేస్తున్న పోరాటంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఈ బాధలు మరింత పెరిగినా పిరికిపందల్లా ఎవరికీ తలవంచం’ అంటూ అంతకు ముందు మమత ట్వీట్ చేశారు.