Monday, December 23, 2024

టీమిండియాను వీడని గాయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: కొంతకాలంగా టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇంగ్లండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారింది. గాయాలతో స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరే జట్టుకు దూరమవుతున్నారు. గాయాలతో రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్‌లు రెండో టెస్టు బరిలోకి దిగలేదు. మిగిలిన మూడు టెస్టులకు వీరిని ఎంపిక చేసినా ఫిట్‌నెస్ సాధించడంలో విఫలం కావడంతో రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పించారు. రాహుల్ దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇప్పటికే జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.

ఇలాంటి స్థితిలో రాహుల్ కూడా గాయంతో సతమతమవుతుండడం జట్టుకు ప్రతికూలంగా మారింది. మూడో టెస్టుకు దూరమైన రాహుల్ మిగతా మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందేహంగా తయారైంది. సిరీస్ ఆరంభానికి ముందే కీలక ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, మహ్మద్ షమిలు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. తొలి టెస్టులో మెరుగైన ప్రదర్శనతో జట్టుకు అండగా నిలిచిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు.

మిగిలిన టెస్టులకు అతన్ని ఎంపిక చేసినా తుది జట్టులో ఆడతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్, జడేజాలు టెస్టుల్లో జట్టుకు చాలా కీలకమైన ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరూ లేనిలోటును పూడ్చడం జట్టుకు అంత తేలికేం కాదు. దీనికి తోడు మరో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. శ్రేయస్ తనదైన రోజు ఎంత పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించగలిగే సత్తా కలిగిన ఆటగాడు. అతను కూడా మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లు కూడా గాయంతో జాతీయ జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు.

పట్టించుకోని బిసిసిఐ
క్రికెటర్లు వరుస గాయాలకు గురవుతున్న భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) పెద్దలు మాత్రం దిద్దుబాటు చర్యలకు దిగడం లేదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా బిసిసిఐకి పేరుంది. పుష్కలంగా డబ్బులు ఉన్నా ఫిట్‌నెస్ ప్రమాణాలు నెలకొల్పడానికి అవసరమైన చర్యలు చేపట్టడంలో బిసిసిఐ విఫలమైందనే చెప్పాలి. కొంతకాలంగా టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. బుమ్రా, షమి, జడేజా, హార్దిక్ వంటీ కీలక ఆటగాళ్లు గాయాల వల్ల చాలా రోజులపాటు జట్టుకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

రాహుల్ కూడా తరచూ గాయాల బారీన పడుతున్నాడు. కోచ్‌ల వైఫల్యమో..లేక ఆటగాళ్ల తప్పిదమా తెలియట్లేదు కానీ.. కీలక ఆటగాళ్లు మాత్రం ఒకరి వెంట ఒకరు గాయాలకు గురవుతున్నారు. చాలా మంది ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడడం వల్లే ఆటగాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురువుతుందని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్ సుదీర్ఘ కాలంగా సాగుతుందని, ఈ టోర్నీలో ఆడడం వల్ల కూడా పలువురు ఆటగాళ్లు గాయాల బారీన పడుతున్నారు. ఇప్పటికైన బిసిసిఐ పెద్దలు ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంశంపై ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్తులో టీమిండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News