కోల్‌కతా : గణతంత్ర దినోత్సవం రోజున పశ్చిమబెంగాల్ రాష్ట్ర శకటానికి కేంద్రం అనుమతి నిరాకరించడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తప్పుపట్టారు. ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించిన కేంద్రం, అదే మహాత్ముడి పై తమ రాష్ట్రం రూపొందించిన శకటాన్ని తిరస్కరించి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శకటాన్ని తిరస్కరించడానికి గల కారణాలను వెల్లడించలేదన్నారు. నేతాజీ 125 వ జయంతి సందర్భంగా కోల్‌కతాలో ఆమె ఆదివారం మాట్లాడారు. నేతాజీ శౌర్యాన్ని, పరాక్రమానికి అద్దం పట్టే విధంగా సృజనాత్మకంగా తీర్చి దిద్దిన శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శిస్తామన్నారు. అధికారం లోకి రాగానే నేతాజీ అదృశ్యం మిస్టరీని చేధిస్తామని చెప్పిన బిజెపి తరువాత పూర్తిగా ఆ ప్రమాణాన్ని విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేతాజీకి సంబంధించి డాక్యుమెంట్లన్నీ ప్రజలందరికీ అందుబాటు లోకి ఉండే విధంగా డిజిటలైజ్ చేశామని చెప్పారు. అమర్‌జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్ని మమత తప్పుబట్టారు.