చిన్న వయసులోనే న్యాయం కోసం, హక్కుల కోసం రోడ్డెక్కిన విద్యార్థి నాయకుడు ఇప్పుడు ఎంఎల్‌ఎగా గెలుపొందినప్పటికీ న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. చట్టసభల లోపల, బయట ప్రజాగొంతుకగా నిలిచిన ఈ వర్ధమాన యువ ఎంఎల్‌ఎ మరింత పట్టుదలతో రాజ్యంతో పోరాడుతున్నాడు. మార్క్సిస్టు – లెనినిస్టు విప్లవకారుడు. రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో హత్యకేసులో ఇరికించబడి ఎంఎల్‌ఎ పదవి కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్నాడు. అతని పేరు కామ్రేడ్ మనోజ్ కుమార్ మంజిల్. రచయిత, కలం పేరు మంజిల్. లక్ష్యం, గమ్యం ఉన్న నాయకుడు. నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు. సడక్ పే స్కూల్ (వీధుల్లో పాఠశాలలు) ఉద్యమం అతని నాయకత్వంలో జరిగింది. ఆ ఉద్యమం జాతీయ స్థాయి ఖ్యాతి పొందింది. 36 ఏండ్లకే బీహార్ రాష్ట్రంలోని అజియోన్ (ఎస్‌సి) నియోజకవర్గం నుంచి 2020లో సిపిఐ (యంయల్) లిబరేషన్ అభ్యర్థిగా గెలుపొందాడు.
ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన దళిత యువ ఎంఎల్‌ఎగా గుర్తింపు పొందాడు. మనోజ్ కపుర్ణిహారా (దేవ్)కు చెందిన నిరుపేద దళిత కూలీ దంపతుల సంతానం. 1984లో జన్మించాడు. తల్లిదండ్రులు మిల్లేష్ కుమార్ ఇటుక బట్టి, వ్యవసాయ కార్మికులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ఉన్నత చదువుల కోసం అనేక ఇబ్బందులకు గురయ్యాడు. గ్రాడ్యుయేషన్ కోసం అర్రాకు వెళ్లాడు. మనోజ్ తల్లిదండ్రులకు యంయల్ పార్టీ నేపథ్యం ఉంది. వారి ఆశ, ఆశయాల ప్రతి రూపం ఇతడే. బీహార్ రాష్ట్రంలో జయప్రకాష్ చేపట్టిన ఉద్యమంలో మనోజ్ మామయ్య పాల్గొన్నాడు. ఫ్యూడలిజంపై తిరుగుబాటు చేసి పద్నాలుగేళ్ల కాలం జైలు జీవితం గడిపాడు. 1970 ప్రాంతంలో వారి గ్రామం హదియబాద్ భూస్వామ్య శక్తుల చేతుల్లో బూడిదయ్యింది.
అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితుల్లో మనోజ్ తల్లి ప్రాణాలతో బయటపడినప్పటికీ సర్వస్వం కోల్పోయింది. భూస్వామ్యశక్తులు, రణవీర్ సేన ప్రైవేటు సైన్యాల ఆరాచకాలకు ఆ కుటుంబం ఎదురొడ్డి నిలబడింది. మనోజ్ విప్లవ పథానికి మనోజ్ కుటుంబ నేపథ్యమే మాతృక. ఆయనొక ఫైర్‌బ్రాండ్, ప్రజాదరణ పొందిన నాయకుడు. అణగారిన తరగతుల పిల్లలను సమీకరించి విద్యా హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేపట్టాడు మనోజ్. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐయస్‌ఎ) నాయకుడిగా చేసిన ఉద్యమాలు బాగా ప్రాచుర్యం పొందాయి. విద్యా హక్కుల పోరాటం బలహీనవర్గాల ఆకలిని, ఏలికల డొల్ల తనాన్ని ఎత్తిచూపింది.
గ్రామీణ పేద కుటుంబాల పిల్లలకు విద్యను నిజమైన హక్కుగా మార్చడానికి ‘సడక్ పే స్కూల్’ ఉద్యమం అత్యంత వినూత్న ప్రచారాలలో ఒకటి. అధ్వాన్నమైన పాఠశాలల దుస్థితిపై రోడ్లపై సింబాలిక్ తరగతులు నిర్వహించడం, పాఠాలు బోధించడం ద్వారా నిరసన వ్యక్తం చేసేవారు. ఆ ప్రాంతంలో పాఠశాలలో వసతుల లేమి, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల కొరత, బోధన నాణ్యత, కులతత్వం, మరుగుదొడ్ల లాంటి సమస్యలను రాజకీయ పోరాటంగా మలిచాడు. అప్పటి నితీశ్ కుమార్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రాథమిక విద్యా పథకాల అమలుకు ఈ పోరాటం కదిలించింది. ఆ తర్వాత దళితుల భూమి హక్కులు, రోడ్లు, విద్యుత్, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర పౌర సమస్యలపై ప్రజలను సమీకరించాడు. పోరాటాలు చేయడంలో సమరశీలతను చాటాడు. విద్యార్థి ఉద్యమం తరువాత విప్లవ యువజన సంఘం (ఆర్‌వైఎ) జాతీయ అధ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం ఆల్ ఇండియా అగ్రికల్చరల్ అండ్ రూరల్ లేబర్ అసోసియేషన్ (అయార్ల) అధ్యక్షుడిగా వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంస్థను నడిపించే బాధ్యతను చేపట్టాడు.
2015 ఎన్నికల సమయంలో భోజ్పూర్ జిల్లా అజింబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో మనోజ్‌తో పాటు 22 మందిని నిందితులుగా చేర్చబడ్డారు. మనోజ్ జైలు నుంచి ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చింది. ఎన్నికల ప్రచారం చేయకుండా ఆధిపత్య, భూస్వామ్య శక్తులు రాజ్యం అండతో నిరోధించాయి. కేసుల పేరుతో ఆయనను జైలుకు పంపించారు. అయినా ఆ ఎన్నికలలో 35 వేల పైచిలుకు ఓట్లను సాధించడం ఓ పెను సంచలనం. అప్పుడు మూడో స్థానంలో నిలిచిన మనోజ్ ఏడాది తర్వాత బెయిల్‌పై విడుదలైన అజియోన్, భోజ్‌పూర్‌లోని అణగారిన ప్రజల కోసం హక్కులు, గౌరవాన్ని సాధించేందుకు అనేక పోరాటాలను ప్రారంభించాడు.
తొమ్మిదేళ్ల కిందటి రాజకీయ దురుద్దేశ కేసులో మనోజ్ మంజిల్‌తో పాటు 22 మంది ఇతర సహచరులను అరా సివిల్ కోర్టు ఈ నెల 13న దోషులుగా పేర్కొంటూ జీవిత ఖైదు విధించింది. దీంతో ఎంఎల్‌ఎపై అనర్హత వేటు పడింది. రాజ్యాంగంపై నమ్మకం లేని పాలకులు ప్రజాస్వామ్యంపై నిరంతర దాడిని కొనసాగిస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో ఎంఎల్‌ఎ మనోజ్ కుమార్ న్యాయం కోసం పోరాడుతున్నాడు. అతనికి తన పార్టీ అండగా వుంది. అక్కడి ప్రజలు అన్యాయానికి, ఫాసిస్టు దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా మనోజ్ పక్షాన నిలబడి పోరాడుతున్నారు. మనోజ్‌కు మద్దతుగా బీహార్ మొత్తం ఉద్యమం జరుగుతుంది. ఈ నెల 19 నుంచి 25 వరకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు గ్రామాల్లోకి వెళ్లి న్యాయ మారణకాండకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
* -మామిండ్ల రమేష్ రాజా
893230218