Friday, November 22, 2024

సాగర్ జలాల్లో తెలంగాణకు అన్యాయం

- Advertisement -
- Advertisement -

Injustice to Telangana in Sagar waters

ఉమ్మడి పాలనలో ఎడమకాల్వను ఇష్టానుసారం పెంచుతూ పోయారు
నందికొండ ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ప్రతిపాదిత ఆయకట్టు 1.3లక్షల ఎకరాలే, దానిని ఆంధ్రపాలకులు 3.7లక్షల ఎకరాలకు పెంచారు
తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదిత 6.6లక్షల ఎకరాల ఆయకట్టును 6.02లక్షల ఎకరాలకు తగ్గించారు
పెన్నా బేసిన్‌లో ఎపి నిర్మించిన జల విద్యుత్ పథకాలను వెంటనే ఆపండి
కెఆర్‌ఎంబి చైర్మన్‌కు ఇఎన్‌సి లేఖలు

మనతెలంగాణ/ హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ వెల్లడించారు.కృష్ణానదిపైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రా ,తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పదాలు జరగలేదని తెలిపారు సాగర్ ఎడమ కాలువను ఇష్టారాజ్యంగా పెంచుకూంటూ పోయి తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం చేశారని వివరిస్తూ ఈఎన్సీ మంగళవారం నాడు కృష్ణానదీయాజమాన్య బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్‌కు లేఖ రాశారు. నందికొండ ప్రాజెక్టు నివేదికలను బేఖాతరు చేస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువను ఇష్టారీతిన పెంచుకొంటూ పొయారని తెలిపారు. 1952లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రం తయారు చేసిన నందికొండ ప్రాజెక్టు నివేదికలో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు నందిగామ తాలుకాలోని కట్లేరు వాగు వరకు మాత్రమే ప్రతిపాదించారని వివరించారు. మద్రాసు రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆయకట్టు లక్షా 3వేల ఎకరాలు మాత్రమేనని ఈఎన్సీ లేఖలో వివరించారు.

1956లో రాష్ట్రాల పునర్విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు నివేదికకు భిన్నంగా వ్యవహరించిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టు నివేదికను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రతిపాదించిన ఆయకట్టును 1.3లక్షల ఎకరాలనుంచి 3.78లక్షల ఎకరాలకు పెంచిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన ఆయకట్టును 6.6లక్షల ఎకరాల నుంచి 6.02లక్షల ఎకరాలకు తగ్గించిందని లేఖ ద్వారా బోర్డు చైర్మన్ దృష్టికి తెచ్చారు. లక్ష ఎకరాలను ఎత్తిపోతల పథకాల ద్వారా సాగులోకి తీసుకురావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు.

చిన్న చెరువుల కింద 53వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉందని , ఈ అంశాలను కూడా ఎపి ప్రభుత్వం విస్మరించిందన్నారు. పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రెగ్యులేటర్ గేట్ కనీస మట్టాన్ని 13 మీటర్లు తగ్గించినందువల్ల తెలంగాణ ప్రాంతం చాలా ఆయకట్టును కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు. 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి నివేదికకు అనుగుణంగా ఆంధ్ర ప్రాంతంలో ఆయకట్టును 1.3లక్షల ఎకరాలకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. జస్టిష్ బ్రిజేష్ కుమార ట్రిబ్యునల్ ముందు 1954 ఉమ్మడి నివేదిక ప్రకారం ఆంధ్రా ప్రాంతంలోని ఆయకట్టును కట్లేరు వాగు వరకూ 1.3లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని , జులై 15నాటి గెజిట్ నోటిఫికేషన్‌లో షెడ్యూల్ 2లో పేర్కొన్న 4.8నుంచి 4.14 వరకూ ఉన్న అంశాలను తొలగించాలని కోరారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కూడా తెలియజేయాలని బోర్డు ఛైర్మన్‌కు లేఖ ద్వారా ఈఎన్సీ మురళీధర్ విజ్ణప్తి చేశారు

పెన్నా బేసిన్‌లో జలవిద్యుత్ పథకాలు వెంటనే ఆపండి.

అనుమతి లేకుండా జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఈఎన్సీ మురళీధర్ ఆరోపించారు. పెన్నార్ బేసిన్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల విషయాన్ని తెలియ పరుస్తూ ఈఎన్సీ కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు మరో లేఖ రాశారు. జలవిద్యుత్ ప్రాజెక్టులన్నీ కృష్ణా నది నుంచి ఎత్తిపోసిన నీటి ఆదారంగానే ప్రతిపాదించటం జరిగిందన్నారు. కృష్ణా బేసిన్ నుంచి నీటిని పెన్నార్ బేసిన్‌కు ఎత్తిపోసి అక్కడ జలాశయాల నుంచి ఎపి ప్రభుత్వం జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందన్నారు. మొత్తం నాలుగు పంపుడ్ స్టోరేజి హైడల్ ప్రాజెక్టులు ఉన్నాయని వాటిలో కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ , కడప జిల్లాలోని గండికోట రిజర్వాయర్ ,అనంతపురం జిల్లాలోని చిత్రావతి రిజర్వార్ , నెల్లూరు జిల్లాలోని సోమశిల రిజర్వాయర్‌లు ఉన్నట్టు వివరించారు శ్రీశైలం జలాశయం నుంచిః ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 34టిఎంసిల నీటిని మాత్రమే శ్రీశైలం కుడి గట్టు కాలువ ద్వారా తరలించాల్సి వుందని తెలిపారు.

అందులో చెన్నై నగర తాగునీటి అవసరాలకోసం 15టిఎంసిలు, శ్రీశైలం కుడి కాలువ నుంచి 19టిఎంసీల నీటిని మాత్రమే తరలించాలన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా కుడి ప్రధాన కాలువకు ,బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ సముదాయం ద్వారా పెద్ద ఎత్తున నీటిని ఎత్తిపోసి ఆయా రిజర్వాయర్లనుంచి జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని కృష్ణాబోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల తెలంగాణ బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు తీవ్రమైన అన్యాయం జరగనుందని వివరించారు. కృష్ణానదీయాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందని చిత్రావతి స్టోరేజ్ జలవిద్యుత్ ప్రాజెక్టులను, ఇతకర ప్రాజెక్టులను వెంటనే నిలిపి వేయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీయాజామాన్య బోర్డు ఛైర్మన్‌ను కోరారు. గతంలో కూడా ఇదే అంశాలను వివరిస్తూ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్‌కు లేఖ రాసినన్పటికీ బోర్డు నుంచి ఇంత వరకూ ఎటు వంటి ప్రతిస్పందన కనబడలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News