Saturday, November 23, 2024

ఆవిష్కరణలే అభివృద్ధి సోపానాలు

- Advertisement -
- Advertisement -

‘Innovation is a way of thin king, a system, a method, a process which requires systematic management and proper decision -making to work. There is no doubt that for the entire society and organizations, the most important driving force for the new round of growth is innovation’ –Judith A. Chevalier

గత మూడు శతాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో ఎక్కడైతే శాస్త్ర సాంకేతిక పరిశోధనలు విస్తృతంగా జరుగుతూ వస్తున్నాయో ఆ దేశాలు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నాయన్నది సుస్పష్టం. మొదటి పారిశ్రామిక విప్లవానికి పూర్వం పాశ్చాత్య దేశాలతో తూర్పు దేశాలు సంపదలోనూ, అభివృద్ధిలోనూ సరిసమానంగా ఉండేవి. స్కాటిష్ శాస్త్రవేత్త జేమ్స్ వాట్ కనిపెట్టిన ఆవిరి యంత్రం (స్టీమ్ ఇంజన్) ఈ రెండు ప్రాంతాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాన్ని సృష్టించింది. జేమ్స్ వాట్ ఆవిష్కరణ తొలి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది. ఇక్కడే పాశ్చాత్య దేశాల పురోగతికి, తూర్పు దేశాల వెనుకబాటుకు బీజం పడింది. ఆ తదుపరి జీవ, రసాయన, భౌతిక శాస్త్రాల్లో వెలుగు చూసిన కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని శీఘ్రగతిన మారుస్తూ వచ్చాయి.

ఈ కారణంగానే ఐరోపా దేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నాల్గో పారిశ్రామిక విప్లవం ఆరంభమైంది. అయితే, పరిశోధనలు- అభివృద్ధి మూలంగా ఇప్పటికే ఒకే ప్రపంచంలో బహుముఖాభివృద్ధి ప్రపంచం (Most deve loped world), అత్యల్పాభివృద్ధి ప్రపంచం ( Least developed world) అను రెండు ప్రపంచాలు ఏర్పడ్డాయి. నాల్గో పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించేది బహుముఖాభివృద్ధి ప్రపంచంలోనూ ఎవరనేది చెప్పడం కష్టమంటున్నారు వైజ్ఞానిక నిపుణులు. ఎందుకంటే ఇది వరకటి మూడు పారిశ్రామిక విప్లవాల మాదిరిగా నాల్గవ పారిశ్రామిక విప్లవం ఒకే సాంకేతికతపై ఆధారపడదు. ఇది అవధులు లేనిది, అత్యంత వేగవంతమైంది. 5 జి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, డేటా లేదా క్రిప్టోకరెన్సీల వంటి కొత్త టెక్నాలజీలు బహుమితీయంగా నాల్గో పారిశ్రామిక విప్లవం పరిక్రమిస్తుంది.

ఈ దఫా ఏ ఒక్క దేశమో, ఏ ఒక్క కంపెనీయో, ఏ ఒక్క కూటమో ఆధిపత్యం చెలాయించడం ససేమిరా కుదరదు. సుదీర్ఘ కాలంగా నూత్న ఆవిష్కరణలతో మునుముందుకెళుతున్న దేశాలతో పాటు శాస్త్రసాంకేతిక పరిశోధనల్లో వెనుకంజలో ఉన్న తూర్పు దేశాలకూ ఈ పర్యాయపు పారిశ్రామిక విప్లవ బహుమితీయత ఆవిష్కరణల్లో అగ్రభాగాన నిలబడగలిగే అవకాశాన్ని ప్రాప్తింప జేస్తున్నది. ఇక్కడ వెనుకబడిన అత్యల్పాభివృద్ధి దేశాలకు కావాల్సిందల్లా పరిశోధక బృందాలు. పరిశోధక బృందాలకు అందాల్సిందల్లా ప్రేరణ, వివిధ స్థాయిల్లో వ్యవస్థాగతమైన ప్రోత్సాహం, గుర్తింపు.

అతిపెద్ద మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ సంస్థలు మూడింటి (Big Three)లో ఒకటైన McKin sey జరిపిన ఇటీవలి సర్వేలో 84 శాతం మంది గ్లోబల్ కంపెనీల యాజమాన్యాలు తమ పరిశ్రమల మనుగడకు వినూత్న ఆవిష్కరణలే శరణ్యమంటున్నారు. కంపెనీల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో 94 శాతం ఆవిష్కరణలు అసంతృప్తిని కలిగిస్తున్నాయని యాజమాన్యా లు వాపోతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు, సమయం రెండూ వెచ్చించి దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలన్నీ గత ఆవిష్కరణలకు డమ్మీలని, ఆశించిన మేర పరిశోధనలు ఫలప్రదం కావడం లేదని పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు, రచయిత స్టీవ్ డెనింగ్ చేసిన ‘మీరు ఈ పెద్ద కంపెనీలను సందర్శించండి. మీరు ముందు ద్వారంలో నడుస్తారు అది తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది. మీరు అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మీరు వ్యక్తులతో మాట్లాడటం మొదలుపెడతారు. ఇది కేవలం నిరాశాజనకమైన సిబ్బందితో కూడిన సాధారణ ప్రదేశం అని మీరు కనుగొంటారు. వారు పెద్ద ఆలోచనలను అనుసరించడం లేదు, పెద్ద సంస్థలు అయినప్పటికీ వాటిని అభివృద్ధి చేయడానికి ఎటువంటి యంత్రాం గం లేదు. నేను తరచుగా ఈ కంపెనీలను సందర్శించి అక్కడ పని చేస్తున్న మానవ ప్రతిభను వ్యర్థం చేయడం గురించి నిరాశ చెందాను. ఈ కంపెనీలు మన పోటీతత్వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనుగడ సాగించాలంటే మరింత ఉత్పాదకత సాధించాలి’ వ్యాఖ్యను గమనిస్తే ఆవిష్కరణలకు పరిశోధకులకు పెద్దయెత్తున డిమాండు ఎంత ఉందో తెలుస్తుంది.
ఆవిష్కర్తల తయారీ జరగకుండా ఆవిష్కరణలు సాధ్యపడవు.

ఆవిష్కర్తలకు ఉండాల్సింది నవకల్పనా సామర్థ్యం (Innovation Capacity). ఇన్నోవేషన్ అనేది ఒక ఆలోచనా విధానం, ఒక వ్యవస్థ, ఒక పద్ధతి. ఇందుకు క్రమబద్ధమైన నిర్వహణ అవసరం. కల్పనోత్సాహం దిశగా సరైన నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఆవిష్కరణ ప్రక్రియలో ఎంతో ముఖ్యమైంది. సమాజం మొత్తానికి, సంస్థలన్నిటి కొత్త తరహా అభివృద్ధికి అత్యంత కీలకమైన చోదక శక్తి ఆవిష్కరణలే కాబట్టి, ఆవిష్కర్తల ప్రథమ గుణం కల్పనాశక్తి. విద్యార్థులు భావి పరిశోధకులు కావడానికి కల్పనాశక్తిని రగిలించడమే ఉపాధ్యాయులు చేయవలసింది. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు ‘మెదడన్నది మనకున్నది అది కాస్తా పని చేస్తే విశ్వరహః పేటికా విపాటన జరుగక తప్పదు’. మెదడు పని చేయాలంటే, మెదడుకు పని ఇవ్వాలి.

మెదడుకు పని ఇవ్వడమే బోధన అసలైన లక్ష్యం. సాధన (ప్రాక్టీస్), శోధన (ఎంక్వైరి) రెండూ బోధన ద్వారా ఉపాధ్యాయులు పిల్లల మెదడుకివ్వాల్సిన పనులు. సుప్రసిద్ధ తత్త్వవేత్త, విద్యావేత్త, క్యూబా మేధోజీవులందరూ తండ్రి లా భావించే జోస్ డి లా లూజ్ వై కాబల్లెరో ఉపాధ్యాయుల పనితీరు గురించి ఓ సందర్భం లో మాట్లాడుతూ ‘ఎవరైనా బోధించగలరు కానీ జీవించి ఉన్న అపోస్తలులు మాత్రమే విద్యను అందించగలరు’ అంటాడు. క్రైస్తవంలో అపోస్తలు మత ప్రచారం కోసం అంకితమైన వ్యక్తి. జ్ఞాన యుగ సందర్భంలో మాట్లాడుకుంటే జ్ఞానం అందించేందుకు, జ్ఞానాన్ని వెలికి తీసేందుకు అంకితమైన అధ్యాపకుడు అని అర్థం. ఇదిగో జ్ఞానాంకితులైన టీచర్లే సాధన, శోధన చేయించగలరు. మన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సాధనలోంచే శోధన చేశాడు.

తన గురువు ‘ఏ అంకెనైనా, సంఖ్యనైనా అదే అంకెతో, సంఖ్యతో భాగిస్తే భాగఫలం ఒకటి వస్తుంది, ఐదు పండ్లను ఐదుగురికి సమానంగా పంచితే మనిషికొకటి వస్తాయని సూత్రీకరించినప్పుడు లేదు! సున్నా పండ్లను సున్నా మనుషులకు పంచితే ఒకటి రాదు’ అని చెప్పడం శోధనలో భాగమే.

ఇప్పుడు చదువుల్లో సాధనా మందగించింది. శోధనా కుంటువడింది. నవకల్పనలకు జోస్ డి లా అన్నట్టు మందగించిన సాధనా, శోధనా ప్రక్రియలను పునర్నిర్మించాల్సి వుంది. ఆవిష్కరణలకు ప్రభావం (Effectiveness), కొత్తదనం (Novelty), ఆటోమేషన్ (Automation) అనేవి ముఖ్య లక్షణాలు. ఆవిష్కరణలకు ప్రత్యేక ప్రయోజనాలూ ఉన్నాయి. ఇవి.1. సంక్లిష్టమైన వ్యాపార సమస్యలకు పరిష్కారం చూపడం (Solves complex business pro blems). 2. ఉత్పాదకతను పెంచడం (Increases produc tivity). 3. వ్యాపార ప్రక్రియకు ప్రత్యేకతను కొత్తదనాన్ని తీసుకురావడం (Brings unique ness and novelty to business process). 4. పోటీ ప్రయోజనాన్ని అందించడం (Gives a competitive advantage). 5. ఖర్చును తగ్గించడంతో పాటు ఆదాయాన్ని పెంచడం (Reduces cost and increases revenue). ఇందుకే ఇవాళ ఆవిష్కర్తలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మరీ ముఖ్యంగా టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైనింగ్ (TED) రంగాల్లో ఆవిష్కరణలు సత్వర లాభాలను గడిస్తున్నాయి.

అనామతు ఆర్థిక వనరుల మధ్య, వేగవంతమైన అతి పోటీ మధ్య వెనుకబడిన దేశాలు తట్టుకోగలవా అంటే కనాకష్టమే మరి! ఆవిష్కర్తల తయారీ ఆవిష్కరణలు వెలుగు చూడటం అంత సులువేం కాదు. అయినా ఎదురీత, మేధోపోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఇది ఆవిష్కరణలకు స్వర్ణయుగం కూడా. ఇంతకు ముందెప్పుడూ ఇప్పటిలా ఆవిష్కరణలకు ఇంతటి ప్రజాదరణ ఉండేది కాదు. ఏ చిన్న కొత్త వస్తువు అందుబాటులోకి వచ్చినా అది వెంటనే మార్కెట్ అవుతోంది. ఇందుకు దోహదం చేస్తున్న టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ ఈ రెండూ కలగలసిన మెటామోడల్ విధానం ఇప్పుడు విజృంభిస్తోంది. నేరుగా ఉత్పత్తి, సేవా రంగాలే కాకుండా వీటి అనుబంధ రంగాలలో కొంగ్రొత్తదనాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో తయారీ రంగం నగరాలు, పట్టణాల నుంచే కాకుండా గ్రామాలకు తమ క్షేత్రాలను విస్తరించాయి కాబట్టి ఎక్కడికక్కడ ఆవిష్కరణలకు అనుసంధానం, చొరవ ద్విగుణీకృతమై మేధో శ్రమను స్వాగతిస్తున్నాయి. గ్రామ సీమల్లో సైతం అదృష్టం వంటి పాత భావనలను విడనాడి ప్రతిభా సమ్మతంగా అభివృద్ధి చెందిన దేశాలకు పోటీనివ్వగల కొత్తతరం ఇప్పుడు స్కూళ్లు, కాలేజీల్లో సిద్ధంగా ఉన్నారు. సాధన, శోధనలనే గురువులు నేర్పించి సరిచూడాల్సి వుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News