Monday, December 23, 2024

మెట్రో తరహాలో ఆదాయ మార్గాలు

- Advertisement -
- Advertisement -

రవాణా శాఖ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలి

అంతర్గత ఆదాయం వనరులు పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలి
వాస్తవ పరిస్థితిలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలి
రవాణా, బిసి సంక్షేమ శాఖల పద్దుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
అదనంగా కొత్త బస్సులకు ప్రభుత్వం సాయం చేయాలి
బడ్జెట్ కేటాయింపుల్లో మా శాఖలకు ప్రాధాన్యత కల్పించాలి
ఉప ముఖ్యమంత్రి భట్టికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

మనతెలంగాణ/హైదరాబాద్ : అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణా శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం డాక్టర్ బి. అంబేద్కర్ సచివాలయంలో రవాణా, బిసి సంక్షేమ శాఖల పద్దులపై రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహాలక్ష్మి కార్యక్రమం అమల్లో ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అన్నారు. రవాణా శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ఇంకా ఆస్కారం ఉందని, అంతర్గత ఆదాయం వనరులు పెంపొందించుకునే మార్గాలను కూడా అన్వేషించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి ఆశించిన మేరకు రాబడులు లేనందున, వాస్తవ పరిస్థితిలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసికి మరింత ఆదాయం వచ్చేలా కృషి చేయాలి: భట్టి
కార్పొరేషన్ నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్టీసి ఖర్చులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని, అలాగే మెట్రోరైలు తరహలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి సూచించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వివిధ నమూనాలను అధ్యయనం చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆయన సూచించారు. బిసి రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు ప్రాధాన్యమివ్వాలని ఆయన ఆదేశించారు. చేతివృత్తుల వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన కోరారు. ఆర్టీసితో పాటు రవాణా శాఖ బిల్డింగ్స్‌కు సోలార్ పవర్ అమర్చే విషయమై అధికారులు ఆలోచించాలని డిప్యుటీ సిఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
బ్యాంకు లోన్‌లు, కొత్త నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం చొరవ చూపాలి: మంత్రి పొన్నం
బడ్జెట్ కేటాయింపుల్లో రవాణా, బిసి శాఖలకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం విజయవతంగా కొనసాగుతుందని ప్రస్తుతం 80 శాతం బసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, రోజుకు 27 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని ఇది గతం కంటే ప్రతి రోజు 9 లక్షల మంది మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి భట్టితో వెల్లడించారు. ఈ పథకం వల్ల ఆదాయం తగ్గి ఖర్చు పెరుగుతుందని ఆయన తెలిపారు. అందులో భాగంగా అదనంగా కొత్త బస్సులకు ప్రభుత్వం సాయం చేయాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. బ్యాంకు లోన్‌లు, కొత్త నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బాండ్లు, పిఎఫ్, సిసిఎస్ బకాయిల చెల్లింపులపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం భట్టి విక్రమార్కను కోరారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు నిరంతరంగా శ్రమిస్తున్నారని సమ్మక్క -సారక్క జాతర బిగ్ టాస్క్ అని ఆలోపు డిఏల బకాయిలపై ఉద్యోగులకు శుభవార్త చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.
ప్రతి నెల 01న ఆర్టీసి ఉద్యోగులకు జీతాలు పడేలా చూడాలి: మంత్రి పొన్నం
ప్రతి నెల ఒకటో తేదీన ఆర్టీసి ఉద్యోగులకు జీతాలు పడేలా చూడాలని, మహాలక్ష్మి విజయవంతానికి ప్రభుత్వం సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. కొన్ని బస్సులు బయట రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల తెలంగాణలో ఆదాయాన్ని కోల్పోతుందని ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. రవాణా శాఖ నూతన భవన నిర్మాణాల కోసం యూజర్ చార్జెస్ వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సిఎంకు విజ్ఞప్తి చేశారు. సమీక్షా సమావేశంలొ పాల్గొన్న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు గారు ,రవాణా శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ద ప్రకాష్ గారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ,ఇతర రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు..
ఆర్టీసిలో రిక్రూట్‌మెంట్లు చేపట్టాల్సింది….మంత్రి పొన్నం
మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా చేయడం వల్ల కొత్త బస్సులను కొనుగోలు చేయల్సిన అవసరం ఏర్పడిందని అదేవిధంగా ఆర్టీసిలో రిక్రూట్‌మెంట్లు కూడా చేపట్టాలని డిమాండ్ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసి సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలు, కల్యాణలక్ష్మి, స్కాలర్‌షిప్‌లు, వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్లకు ఆర్థిక సహాయం శాఖ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రతి స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బిసి గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సీస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని ఆయన కోరారు. కుల వృత్తుల్లో ఉన్నవారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చేందుకు అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, బిసి సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి. వెంకటేశం, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఆర్టీసి ఎండి సజ్జనార్ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News