క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించిన తర్వాతనే
విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం
ప్రత్యక్ష బోధనపై ఆచితూచి అడుగులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభంపై ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పలు రాష్ట్రాల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభమైనా రాష్ట్రాల పరిస్థితులతో తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులు తదితర అంశాలను పరిశీలించిన తర్వాతనే ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని గతంలో వైద్యశాఖ సానుకూల నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచీ ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి దశలావారీగా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించాలని తొలుత ప్రభుత్వం భావించినప్పటికీ దానిని మరికొంత వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే విద్యాసంస్థలు తెరిచిన ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరు వరకు పరిస్థితి పరిశీలించి ఆ తర్వాత పాఠశాలల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
టీచర్లకు వ్యాక్సినేషన్‌పై దృష్టి
రాష్ట్రంలో ఎప్పుడైనా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధ్యాపకులు, బోధన సిబ్బందికి వ్యాక్సినేషన్‌పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇప్పటికే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి దాదాపు వాక్సినేషన్ పూర్తయిందని, ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటే ముందుకురావాలని డిహెచ్ డాక్టర్ శ్రీనివాస్ రావు టీచర్లను కోరారు.
ఎపిలో ప్రారంభమైన పాఠశాలలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, తమిళనాడులో సెప్టెంబర్ 1 నుంచి 9 నుంచి -12 తరగతులు 50 శాతం విద్యార్థులతో ప్రత్యక్ష బోధన చేపట్టాలని భావిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 9- నుంచి 12 తరగతులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిం చాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం సామర్థ్యంతో ప్రత్యక్ష బోధనకు ఉపక్రమించింది. ఒడిశా జూలై 26 నుంచే 10, 12 తరగతులు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టింది. ఢిల్లీ మాత్రం వాస్తవ పరిస్థితిపై నిపుణులతో కమిటీ వేసింది. పాఠశాలలు ప్రారంభమైన రాష్ట్రాలలో పరిస్థితులను పరిశీలించి ఆ తర్వాత రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ముందుగా 9,10 తరగతులకు..?
రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి, ఆ తర్వాత ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అనుమతించే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యక్ష బోధన ప్రారంభించవలసి వస్తే ముందుగా 9,10 తరగతులకు, కళాశాల విద్యార్థులకు అనుమతిచ్చే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కొంతకాలం పాటు 9, ఆపై తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు అనుమతిచ్చి, ఆ తర్వాత కొంతకాలం పాటు పరిస్థితులను పరిశీలించి మిగతా తరగతుల ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకోనున్నట్ల తెలిసింది. ఒకవేళ ప్రత్యక్ష తరగతులకు అనుమతిచ్చినా గత ఏడాది తరహాలోనే తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలని, హాజరును తప్పనిసరి చేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభించే విషయాన్ని సీరియస్‌గా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.