హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ కేసులు అధికమైన నేపథ్యంలో ఈ పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల ఆచూకీని కనిపెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా లేవని పెదవి విరిచింది.
చిన్నారుల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అలాగే అదృశ్యమైన చిన్నారుల వివరాలను అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరో రెండు వారాల్లో 33 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) మాట్లాడుతూ.. రాష్ట్రంలో దర్పన్ కార్యక్రమం అమలవుతుందని ధర్మాసనానికి వివరించారు. ఈక్రమంలో ఈ పిటీషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.