Sunday, December 22, 2024

లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్

- Advertisement -
- Advertisement -

 ఐదుగురు సభ్యులతో ఏర్పాటు
సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం
ఆదేశాలు కోర్టును రాజకీయాలకు
వాడుకోవద్దని చురకలు

న్యూఢిల్లీ : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ వివాదంలో సిబిఐ డైరెక్టర్‌య పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌తో విచారణ జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానం అదేశించింది. న్యాయమూర్తులు బిఆర్ గవాయి, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారణ చేపట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో ‘రాజకీయ కురుక్షేత్రం’గా కోర్టును వినియోగించుకోవడానికి తాము అనుమతించబోమని బెంచ్ స్పష్టం చేసింది. తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణ రాజకీయపరంగా సున్నితమైన వివాదంగా పరిణమించగా దర్యాప్తు జరిపించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో సుప్రీం కోర్టు నియమిత సిట్ బాధ్యత తీసుకోనుండడంతో ఈ పరిణామం ప్రాముఖ్యం సంతరించుకున్నది.

స్వతంత్ర సిట్‌లో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ నుంచి ఇద్దరు అధికారులు, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారని బెంచ్ తెలియజేసింది. ‘రాజకీయ రణరంగంగా కోర్టును వాడుకోవడాన్ని మేము అనుమతించబోమని స్పష్టం చేస్తున్నాం. అయితే, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మనోభావాల దృష్టా రాష్ట్ర పోలీస్, సిబిఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ప్రతినిధితో కూడిన స్వతంత్ర సిట్‌తో దర్యాప్తు నిర్వహించాలని అదేశిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించడం సముచితమని బెంచ్ ఆదేశించింది. సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు విచారణ అప్పగించాలా అన్న విషయమై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరిన విషయం విదితమే.

దీనితో సిట్ విచారణపై తమకు ఎటువంటి సందేహాలూ లేవని సొలిసిటర్ జనరల్ చెప్పారు. అయితే, సిట్‌పై పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక స్వతంత్ర దర్యాప్తు జరిగితే మంచిదేనని జస్టిస్ గవాయి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో పూర్వపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలారంభంలో ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాయుడు ‘హీనమైన ఆరోపణలు చేస్తున్నారని, అధికార తెలుగు దేశం పార్టీ (టిడిపి) తమ వాదన సమర్థనకు ఒక లేబొరేటరీ నివేదికను ప్రచారంలోకి తీసుకువచ్చిందని వైసిపి నిందించింది. బిజెపి నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, వైసిపి ఎంపి వైవి సుబ్బారెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపి ఈ ఉత్తర్వు జారీ చేసింది. పిటిషన్లలోని ఆరోపణలు, ప్రత్యారోపణలను గాని, రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రతివాదుల వైఖరిని తాము పరిశీలించలేదని బెంచ్ స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌లోని అధికారుల నిష్పాక్షికతను ప్రశ్నించడంగా తమ ఉత్తర్వును పరిగణించరాదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. భగవంతునిపై విశ్వాసం ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే స్వతంత్ర సంస్థకు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వు జారీ చేస్తున్నదని బెంచ్ తెలియజేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో స్వతంత్ర సిట్ దర్యాప్తు చేస్తుంది’ అని బెంచ్ తెలిపింది. సిబిఐ అధికారులు ఇద్దరిని సిబిఐ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారులు ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుందని బెంచ్ తెలియజేసింది. స్వతంత్ర సిట్‌లో భాగం కాగల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ సీనియర అధికారిని ఆ సంస్థ చైర్‌పర్సన్ నామినేట్ చేయగలరని బెంచ్ తెలిపింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సెప్టెంబర్ 30న విచారణ సమయంలో బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. పూర్వపు జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వాడారన్న చంద్రబాబు బహిరంగ ప్రకటనను కూడా బెంచ్ ఆ రోజు ప్రశ్నించింది. లేబొరేటరీ పరీక్ష నివేదిక ‘ఏమాత్రం స్పష్టంగా లేదు’ అని, ‘తిరస్కృత నెయ్యి’ని పరీక్షించినట్లు ప్రాథమికంగా సూచించిందని బెంచ్ వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News